Nov 09,2023 21:31

ఇక్రాప్‌ నమోదు చేస్తున్న వ్యవసాయ శాఖ సిబ్బంది (ఫైల్‌)

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందించింది. గత ఏడాది జారీ చేసిన నిబంధనలతో పాటు ధాన్యం రవాణాచేసే వాహనాలకు జిపిఎస్‌ సిస్టమ్‌ తప్పకుండా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ భారం రైతులపై పడకుండా చూడాలని రైతులు, ఎపి రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనల సంగతి సరే... వాటి అమలే ఆధ్వానంగా ఉంటుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో వరి ప్రధాన పంట. ఈ ఏడాది ఖరీఫ్‌లో అత్యధికంగా 2.31,835 ఎకరాల్లో సాగైంది. ఇందులో చాలా వరకు నీటి ఎద్దడితో ఇప్పటికే ఎండిపోయింది. మరికొంత నీటి తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. ఈనేపథ్యంలో కరువు మండలాలుగా గుర్తించడం, లేదా ఆర్థికంగా భరోసా పలకడం వంటి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం ధాన్యం కొనుగోలు విధానాలపై మాత్రమే ముందుకు సాగుతోంది. ఇటీవల జిల్లాకు వచ్చిన సివిల్‌ సప్లై కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ నిబంధనలపై సమావేశం నిర్వహించిన విషయం విధితమే. ఆ రోజు జరిగిన చర్చల ప్రకారం ఇ -క్రాప్‌ నమోదు చేయించుకున్న పంటలకు సంబంధించిన ధాన్యం మాత్రమే కొనుగోలు చేయనున్నారు. 2.31లక్షల ఎకరాల మేర వరి పంట ఇ-క్రాప్‌ నమోదు చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులోనూ 1,73,613 మంది రైతులు మంది నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సంబంధిత విస్తీర్ణంలో పండిన ధాన్యం ఇకెవైసి చేయించుకున్న 1,73,613మంది రైతులకు మాత్రమే విక్రయానికి వీలుంటుంది. వీరంతా స్థానిక ఆర్‌బికెల్లో షెడ్యూల్‌ చేయించుకోవాలి. దాని ప్రకారమే వరి కోతలు మొదలు పెట్టాల్సి ఉంటుంది.
ఈ ఏడాది సుమారు 4,63,624 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చని, ఇందులో స్థానిక అవసరాలు పోగా, 4,05,200 మెట్రిక్‌ టన్నుల వరకు మిగులు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో సుమారు 3,41,000 మెట్రిక్‌ టన్నుల మేర కొనుగోలు చేయాలని అధికారుల లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వున్న 510 రైతు భరోసా కేంద్రాల పరిధిలో 246 క్లస్టర్లు ఏర్పాటు చేయాలని, ఆయా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది బ్యాంకు గ్యారెంటీలను బట్టి కాకుండా, మిల్లు సామర్థ్యాన్ని బట్టి ధాన్యం కేటాయించాలని కూడా కమిషన్‌ సూచన చేశారు.
ధాన్యం క్రయ, విక్రయాల నిబంధనలివే..
- ఇక్రాప్‌లో నమోదైన విస్తీర్ణంలో సాగైన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తారు.
- ధాన్యం విక్రయించే రైతుకు తప్పనిసరిగా ఇకెవైసి నమోదై ఉండాలి.
- పంట కోతకు ముందే ఆర్‌బికెలో షెడ్యూల్‌ తీసుకుని, దానిబట్టి కోతలు మొదలుపెట్టాలి.
-  నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉండేలా ధాన్యం సిద్దం చేసుకోవాలి
-  కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించే వాహనానికి కచ్చితంగా జిపిఎస్‌ అమర్చాలి.
-  గోనె సంచులను, హమాలీలను రైతులు ఏర్పాటు చేస్తే అందుకు సంబంధించిన మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇందుకనుగుణంగా వివరాలను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి.
-  ఎఫ్‌టిఒ చేతికందిన తర్వాత, రైతు మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరైనా మిల్లరు అన్‌లోడ్‌ చేయడానికి డబ్బులడగితే ఆర్‌బికె సిబ్బంది లేదా టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1967కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.
-  ధాన్యం అమ్మే సమయంలో ఇబ్బంది ఎదురైతే జిల్లా కంట్రోల్‌ రూమ్‌ నంబరు 8331056278 నెంబర్‌కు గాని రాష్ట్ర ప్రభుత్వ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1967కు ఫోన్‌ చేయవచ్చు.