- ఇంటి నిర్మాణం కానివ్వకుండా రెండు నెలలుగా వేధింపులు
- తహసీల్దారు అనుమతించినా వీఆర్వో ససేమిరా అంటున్న వైనం
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఆటో నడుపుకొంటూ జీవనం సాగించే ఓ పేద కుటుంబం రూపాయి రూపాయి కూడబెట్టుకొని డి కే టీ స్థలంలో ఇళ్ళు నిర్మించుకొని అద్దె ఇంటి కష్టాలు నుంచి తప్పుకోవాలన్న వారి సొంతింటి కలను వీఆర్వో గత రెండు నెలలుగా అడ్డుకుంటూ ఇల్లు నిర్మించడానికి నానా సాకులు చూపుతూ వేధింపులకు గురి చేస్తున్న ఘటన మండల పరిధిలోని పోలి పంచాయితీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...
దామోదర్ రాజు అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అద్దె ఇంట్లో అవస్థలు పడుతూ రూపాయి, రూపాయి కూడబెట్టుకుని పోలి పంచాయతీలోని ద్వారకా నగర్ లో వారి బంధువుల వద్ద 831-బి సర్వే నెంబర్ లో రెండు సెంట్లు డీకేటి భూమిని తీసుకున్నాడు. అప్పో సొప్పో చేసి ఇల్లు నిర్మించుకుందామనుకుంటే పోలి విఆర్వో శివరాజ్ అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడని బాధితుడు ఆరోపిస్తున్నారు. బాధితుడు దామోదర్ రాజు తన దయనీయ స్థితిని ప్రజాశక్తితో చెప్పుకుంటూ విలపించాడు. దామోదర్ రాజు మాట్లాడుతూ ఆ ప్రాంతంలో ఎవరైనా ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తే తనను కూడా కట్టుకోమని ఏడాది క్రితం వీఆర్వో హామీ ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అనేక నిర్మాణాలు జరిగి ఉండడం వలన తాను కూడా ఇళ్ళు కట్టుకోవాలని ప్రయత్నిస్తే విఆర్వో అడ్డుకొన్నారని తెలిపారు. నెల క్రితం మళ్ళీ ఒకసారి విఆర్వో ను కలవగా స్థలం పరిశీలన చేసి అన్నీ సజావుగా ఉన్నాయనీ.. తహసీల్దార్ వద్ద అనుమతి తీసుకొని ఇళ్ళు కట్టుకోవాలసినదిగా విఆర్వో తెలిపారని అన్నారు. ఆ సమయంలో తహసీల్దార్ సెలవులో ఉండటం వలన ఈ నెల 16 వ తేదీన తహసీల్దార్ ను కలిసి అర్జీ సమర్పించి ఇంటి నిర్మాణానికి తహసీల్దారు వద్ద అనుమతి తీసుకోవడం జరిగిందని తెలిపారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు తహసిల్దార్ సంతకం చేసి ఇచ్చిన పత్రాలు చూపినా వీఆర్వో మాత్రం కొన్ని రోజులు ఆగాలని, తాను విచారణ చేసి చెబుతానని చెబుతూ ఎప్పటిలాగే తనను ఇంటి నిర్మాణం గావించకుండా అడ్డుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. రెండు సెంట్లు స్థలాన్ని ఎన్నిసార్లు పరిశీలించాలని., పోలి పంచాయితీలో కోకోల్లలుగా భూకబ్జాలు జరుగుతున్నా పట్టని అధికారులు తన రెండు సెంట్ల స్థలానికి ఇన్ని అడ్డంకులు సృష్టించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తన స్థలాన్ని ఇతరులకు కట్టబెట్టడానికే వీఆర్వో ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వీఆర్వో చరవానికి స్పందించరని., ప్రతిరోజు ఆటో నడిపితే గాని నాలుగు వేళ్ళు నోటికందని పేదరికంతో ఉన్న తమను గత రెండు నెలలుగా చీటికిమాటికి కడప నుంచి రాజంపేటకు తిప్పుకోవడం భావ్యం కాదని విలపిస్తున్నారు. వీఆర్వో తీరుతో విసుగెత్తిన దామోదర్ రాజు దంపతులు తమకు అన్యాయం చేస్తే ఆత్మహత్యే శరణ్యమని విలపిస్తున్నారు. తహసీల్దారు అనుమతించినా వీఆర్వో ససేమిరా అంటుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పోలి పంచాయతీలో చర్చనీయాంశమైనది. ఇప్పటికైనా బాధితుడికి న్యాయం జరుగుతుందో లేదో వేచి చూద్దాం. ఇదే విషయమై వివరణ కొరకు పలుమార్లు విఆర్ఓ శివరాజుకు చరవాణి ద్వారా ప్రయత్నించగా స్పందించలేదు.










