- ఎల్ఈడి విద్యుత్ దీపాల కొనుగోలులో భారీ అవినీతి
- సమస్యలపై అధికారుల్లో కనీస చలనం లేదు
- కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు
ప్రజాశక్తి-హిందూపురం : పురపాలక సంఘంలో అన్ని విభాగాల్లోనూ అవినీతి రాజ్యమేలుతుందని.... పట్టణ ప్రణాళిక విభాగం అయితే అవినీతికి హబ్ గా మారిందని కౌన్సిలర్ శివ ఆరోపించారు. శుక్రవారం మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు 41 అంశాలతో కూడిన అజెండాను కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కౌన్సిలర్ రమేష్ కుమార్ ప్రతి అంశాన్ని చైర్ పర్సన్ ర్యాటిపై చేయడాన్ని అభ్యంతరం తెలిపారు. అత్యవసర పనులకు సంబంధించిన అంశాలను మాత్రమే రాటిఫై చేయాలని సూచించారు. అజెండాలోని 14, 15 అంశాలకు సంబంధించి అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు డీసెంట్ నోటీసును చైర్ పర్సన్ ఇంద్రజకు ఇచ్చి, రద్దు చేయాలని కోరారు. మున్సిపల్ అధికారులకు వార్డు కౌన్సిలర్లు అంటే కనీస గౌరవం లేదని, వార్డుల్లో తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తున్నారని కౌన్సిలర్ నాసిరబాను అన్నారు. వార్డులో నెలకొన్న సమస్యలపై అధికారులు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీస స్పందన సైతం అధికారుల్లో లేదన్నారు. తాము కౌన్సిలర్లు అని చూపించాలంటే ప్రతినెల ప్రమాణస్వీకారం చేయాల్సిన దుస్థితి హిందూపురం పురపాలక సంఘంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీకి చెందిన కొంతమంది కౌన్సిలర్లు ఓట్ల కోసం తమ సొంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చేసి, నేడు వాటికి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారని టిడిపి కౌన్సిలర్ మహాలక్ష్మిఅన్నారు. దీనిపై ఇంజనీరింగ్ అధికారులు అలాంటి వాటికి ఒక బిల్లు సైతం మంజూరు చేయలేదని వివరణ ఇచ్చారు. గతంలో మంజూరైన బ్యాచ్ వర్క్ పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదని, ఆక్రమణల తొలగింపులో భాగంగా పట్టణంలో మొట్టమొదట 15వ వార్డు రహమత్ పురం ప్రాంతం నుంచి ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు తొలగించిన ఆక్రమణల ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆ వార్డ్ కౌన్సిలర్ షాజియా పేర్కొన్నారు. మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల చర్యల వల్ల పార్టీ పరువు మంటగలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డుల అభివృద్ధి కోసం గత రెండు సంవత్సరాలుగా ఒక్కో వార్డుకు రూ.50 లక్షల నుంచి రూ. ఒక కోటి వరకు నిధులు కేటాయించడం జరిగిందని అయితే ఇప్పటివరకు కేటాయించిన నిధుల్లో 50 శాతం సైతం పనులు పూర్తి కాలేదని కౌన్సిలర్ శివ అన్నారు. పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు అన్ని విభాగాల్లోనూ ప్రధాన అధికారుల కొరత ఉందని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మున్సిపల్ చైర్ పర్సన్ కు ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్సీ తో పాటు సంబంధిత శాఖ మంత్రి తో చర్చించి అధికారుల నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు. కౌన్సిల్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం రైల్వే రోడ్డు విస్తరణ పై పెట్టడం జరిగింది. అయితే ఇప్పటివరకు ఆ పనులు పూర్తి కాలేదన్నారు. వేసవి సమీపిస్తున్నదని వివిధ వార్డుల్లో నీటి ఎత్తిడి తీవ్రంగా ఉంది దానిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కౌన్సిలర్ భారతి అధికారులకు సూచించారు. ఇప్పటివరకు మంజూరైన పనులపై మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లు సంయుక్తంగా సమీక్ష సమావేశాలు నిర్వహించి పనులు త్వరగా తిన పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కౌన్సిలర్ మల్లికార్జున సూచించారు. పురపాలక సంఘంలో 31వ వార్డు ఉందన్న విషయాన్ని గుర్తించి, వార్డ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కౌన్సిలర్ చిన్నమ్మ కోరారు. అవినీతికి హబ్ గా పట్టణ ప్రణాళిక విభాగం మారిందని, బైపాస్ రోడ్డులో సర్వే నంబర్ 95/2 హిందూపురం పార్ట్ 2 లో ఉన్న కమర్షియల్ స్థలాన్ని రెసిడెన్షియల్ జోన్ గా మార్చడంతో పాటు అక్కడ పాత భవనం ఉన్నట్లు, ఆ పాత భవనం పడగొట్టి నూతన భవన నిర్మాణం చేపడుతున్నట్లు రికార్డులు సృష్టించి పురపాలక సంఘానికి రావలసిన దాదాపు 60 లక్షల పన్ను అధికారులు ఎగ్గొట్టారన్నారు. దీంతోపాటు పట్టణంలో వివిధ ప్రాంతాలలో షెడ్ల నిర్మాణం పేరుతో భారీ అవినీతి జరుగుతున్నదని, వివిధ ప్రాంతాలలో మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా పెద్ద పెద్ద భవంతుల నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అవినీతికి పాల్పడి వారిపై చర్యలు తీసుకోవడం లేదని కౌన్సిలర్ శివ తో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు పేర్కొన్నారు. దీనిపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వివరణ ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆనంద్ కుమార్ కౌన్సిల్ కు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని, చైర్ పర్సన్ కు మాత్రమే సమాధానం చెప్తానని చెప్పడంతో సమావేశం కొద్దిసేపు గందరగోళంగా మారి, చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లతో పాటు కౌన్సిలర్లు అందరూ గౌరవ కౌన్సిల్ ను అగౌరవపరిచే విధంగా ఈసీపీ మాట్లాడాలని నిలబడి నిరసన తెలిపారు. చివరకు ఏసీపీ క్షమాపణ చెప్పడంతో పాటు విచారణ చేసి నివేదికను కౌన్సిల్ దృష్టికి తీసుకు వస్తానని చెప్పడంతో సభ్యులందరూ శాంతించారు. పట్టణంలో సెంటర్ లైటింగ్ ఏర్పాటలో భాగంగా కొనుగోలు చేసిన ఎల్ఈడి దీపాలలో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు కౌన్సిలర్ ఆసిఫ్ ఆరోపించారు. ఒక్క లైటు మార్కెట్లో రూ.4200 ఉంటే పురపాలక సంఘ అధికారులు రూ. 13.150తో ఎస్టిమేషన్ వేసి ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. ఎన్ని కొనుగోలు చేస్తున్నారు అన్న విషయాలను సైతం అధికారులు పొందుపరచడం లేదన్నారు. ఎల్ఈడి వీధి దీపాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగుల మధ్య ఏమి జరుగుతున్నదో అర్థం కావడం లేదంటూ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి అన్నారు. 32వ వార్డులో ఉన్న డంపింగ్ యార్డ్ నుంచి భరించలేని దుర్వాసన వెదజల్లుతున్నదని వెంటనే నూతనంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ టు షిఫ్ట్ చేయాలని కౌన్సిలర్ రేష్మ భాను కోరారు. పట్టణంలో మాంస విక్రయ దారుల నుంచి మాంస వ్యర్తలు తగిలించడానికి ఇప్పటివరకు యూజర్ చార్జీ పేరుతో ఎంత వసూలు చేశారు, వసూలు చేసిన డబ్బులు ఎక్కడ ఉన్నాయని కౌన్సిలర్ ఆసిఫ్ ప్రశ్నించారు. వసూలు చేసిన డబ్బులకు అధికారులు ఎటువంటి రసీదు ఇవ్వడం లేదన్నారు. ఆదాయాన్ని లేనప్పుడు లక్షలు ఖర్చుపెట్టి మాంస వ్యర్ధాలు తరలించడానికి వాహనం ఎందుకు పెట్టాలని అన్నారు. ఇలా ప్రతి అంశం లోను ప్రతిపక్షం ప్రశ్నించకపోయిన అధికార పక్షంలో ఉండే కౌన్సిలర్లే సభలో ప్రతి అంశం లోను నిలదీశారు. మూడు అంశాలు మినహాయించి మిగిలిన అన్ని అంశాలు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు జబివుల్లా, బలరామిరెడ్డి, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ మెంబర్లు, అన్ని విభాగాలకు చెందిన మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.










