హథ్రాస్! ఈ పేరు వినగానే మనకి యు.పి లో అక్కడ జరిగిన దారుణం గుర్తుకొస్తుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ పోలీసులు ఆ కేసును కప్పిపుచ్చడానికి మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న తీరూ గుర్తుకొస్తుంది. అయితే ఈ హథ్రాస్ అనే పట్టణానికి ఏకంగా నాలుగు రైల్వేస్టేషన్లు ఉన్నాయన్న సంగతి మనకి తెలుసా? హథ్రాస్ సిటీ, హథ్రాస్ రోడ్డు, హథ్రాస్ జంక్షన్, హథ్రాస్ ఖిల్లా-ఇవీ ఆ నాలుగు స్టేషన్లు. వీటిలో హథ్రాస్ జంక్షన్ స్టేషన్ కి ఓ కథ ఉంది. 130 సంవత్సరాల క్రితం ఆ స్టేషన్ కి ఒక సన్యాసి వచ్చి కూచున్నాడు. అతను ఒక దగ్గర కుదురుగా ఉండే రకం కాదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కుదిరితే రైల్లో, లేకపోతే కాలినడకన, కాకుంటే ఎద్దుల బండీ-ఇలా ఏదో ఒక రకంగా ఆయన ప్రయాణం సాగిస్తూనే వున్నాడు. హథ్రాస్ జంక్షన్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌గా ఉన్న శరత్ చంద్ర గుప్తా ఈ సన్యాసిని పరికించి చూశాడు. ఆ సన్యాసి విశాల నేత్రాలు, కోటేరు లాంటి ముక్కు, ప్రశాంత వదనం ఈ గుప్తాను ఆకట్టుకున్నాయి. ఆ సన్యాసి వద్దకు పోయి తన ఆతిధ్యాన్ని స్వీకరించమని కోరాడు. సన్యాసి అంగీకరించాడు. శరత్ చంద్ర గుప్తా ఇంటి వద్ద రెండు రోజులు గడిపాక ఆ సన్యాసి ఇక వెళ్ళివస్తానని బయలుదేరబోయాడు. అప్పుడు శరత్ చంద్ర గుప్తా ''స్వామీ, కాస్త ఆగండి, నేనూ మీతోబాటు వస్తా''నని వెంటనే స్టేషన్ కు వెళ్ళి తన రాజీనామా సమర్పించి ఆ సన్యాసి వెంట ఆయన ప్రధమ శిష్యుడిగా బయలుదేరాడు.
ఇంతకీ ఆ సన్యాసి పేరు చెప్పలేదు కదూ. అతగాడి పేరు నరేంద్రనాధ దత్తా. తర్వాత కాలంలో ఆయనే స్వామి వివేకానందగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు. విశ్వమానవమతభావనను ప్రపంచంముందు ఉంచిన వివేకానందుడు మనువాదాన్ని, కుల వ్యవస్థను, మతం పేరుతో జరిగే దురాచారాలను, పరమత విద్వేషాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన శిష్యుడిగా మారిన శరత్ చంద్ర గుప్తా సన్యాసం స్వీకరించి స్వామి సదానంద గా మారి రామకృష్ణ మిషన్ బాధ్యతలు చేపట్టాడు. ఇటువంటి పేరున్న హథ్రాస్ పట్టణం చరిత్ర ఇప్పుడు ఒక రాజకీయ సన్యాసి నాయకత్వంలో ఇలా మాయని మచ్చను అంటించుకుంది.
- ఫీచర్స్ అండ్ పాలిటిక్స్










