Jan 07,2021 08:05

గుంటూరు, సికింద్రాబాద్‌ : గుంటూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జిజిహెచ్‌)లో గత రాత్రి 10 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఐసియు సమీపంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఐసియులోని రోగులను మరో చోటుకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని కొత్తపేట సిఐ ఎస్‌వీఎస్‌ రాజశేఖరరెడ్డి తెలిపారు. ప్రమాదంలో ఆక్సిజన్‌ సరఫరా చేసే పైపు పాక్షికంగా దెబ్బతిన్నట్టు పేర్కొన్నారు.

గాంధీ ఆస్పత్రిలో దట్టమైన పొగలు..
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో బుధవారం రాత్రి సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. 3వ అంతస్తులోని యూరోలాజి ఆపరేషన్‌ థియేటర్‌లో మంటలు చెలరేగాయి. ఆసుపత్రి నుండి దట్టమైన పొగలు రావడంతో రోగులు భయాందోళనలకు గురయ్యారు. సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది సహకారంతో మంటల్ని ఆర్పివేశారు. షార్ట్‌ సర్కిట్‌ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.