ప్రజాశక్తి గుంటూరు సిటీ (గుంటూరు జిల్లా):తల్లి పొత్తిళ్ల నుంచి ఏడు రోజుల చిన్నారిని పట్టపగలే ఓ మహిళ ఎత్తుకెళ్లిన సంఘటన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. తల్లి నిద్రిస్తుండగా పిసికందును తీసుకెళ్లినట్లు అధికారులు సిసి టివి పుటేజి ద్వారా గుర్తించారు. శిశువు మేనమామ సుభాని పటాన్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరం పొన్నూరు రోడ్డులోని సుబ్బయ్య కాలనీకి చెందిన తన సోదరి షేక్ రోషిని వారం రోజుల క్రితం ప్రసవం నిమిత్తం జిజిహెచ్‌కు వచ్చారు. గత నెల 31న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చారు. మరుసటి రోజు 106వ వార్డుకు తరలించి మంచానికి ఇద్దరు చొప్పున బాలింతలను ఆస్పత్రి సిబ్బంది పడుకోబెట్టారు. రోషిని తన చిన్నారిని పక్కలో వేసుకుని నిద్రించారు. కొద్దిసేపటికి లేచి చూడగా శిశువు కనిపించకపోవడాన్ని గుర్తించి బిగ్గరగా కేకలు వేశారు. ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సిసిటివిలను పరిశీలించగా గుర్తు తెలియని మహిళ ఆ బిడ్డను రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఆస్పత్రి ప్రధాన మార్గం నుంచి వెళ్లడాన్ని గుర్తించారు. మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్లిపోయేవారమని, ఇంతలోనే ఈ ఘటన జరిగిందని చిన్నారి తల్లిదండ్రులు బోరున విలపించారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్ స్పందిస్తూ ఆస్పత్రిలోకి రోగుల సహాయకులుగా కొంతమంది వచ్చి ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నట్టు చెప్పారు. సెక్యూరిటీ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వివరించారు.










