- తప్పిన ప్రమాదం
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పట్టణ పరిధిలోని డిబిఎన్ పల్లె అరుంధతి వాడలో ఆదివారం గ్యాస్ లీక్ అయి ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. అరుంధతివాడలోని బాలిపోగు పెంచలయ్య ఇంటిలో ఉదయం వంట చేయడానికి గ్యాస్ వెలిగించగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో కుటుంబ సభ్యులందరూ భయంతో బయటికి పరుగెత్తారు. అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో వేగంగా స్పందించి సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. రెగ్యులేటర్ సరిగా లేనందున ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు వివరించారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని గ్యాస్ డెలివరీ బాయ్ కి సూచించారు. అగ్నిమాపక శాఖ వేగంగా స్పందించడం వలన రూ.10 వేలు విలువ చేసే చిన్నపాటి వస్తువులు తప్ప మరెలాంటి నష్టం జరగలేదని గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.










