గ్రామాల అభివృద్ధికి సమిష్టి కృషి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : గ్రామస్థాయిలో సమస్యలు పరిష్కారానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా పని చేయాలని ఎంపిపి కేతా వేణుగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఒ శ్రీనివాసులు, ఎంపిపి కేతా వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్యాధికారిణి డాక్టర్ అనూష మాట్లాడుతూ ప్రస్తుతం ఎండలు అధికంగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కరోనా కేసులు పెరుగుతున్నందు వల్ల మాస్కులు తప్పనిసరిగా ధరించాలని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇరిగేషన్ ఏఈ సురేష్ బాబు మాట్లాడుతూ ఆత్మకూరు వరకు సోమశిల జలాలు రెండవ పంటకు అంది అవకాశం ఉందన్నారు గత సీజన్లో 12 ఎకరాలలో రైతులు వరిపైరు పండించుకుంటున్నారని తెలిపారు. ఎంపిడిఒ శ్రీనివాసులు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యంపై కార్యదర్శులు అశ్రద్ధ చేయకుండా చూడాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, కార్యదర్శులు వాలంటీర్లు సమపాలన పాటించాలని బయోమెట్రిక్ అటెండెన్స్ సకాలంలో వేయాలని సూచించారు. స్పందన అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని పెండింగ్లో లేకుండా చూసుకోవాలని తెలిపారు. హౌసింగ్ శాఖ వారు మాట్లాడుతూ మండలంలో 22 లేఅవుట్లు ఉన్నాయన్నారు. అయితే రావులకొల్లు, అప్పారావుపాలెం, నాగులపాడు, రామసాంపల్లి, బండారుపల్లి తదితర గ్రామాల్లో లేఅవుట్లలో ఇబ్బందులు ఉన్నాయని అందువల్ల అనువైన స్థలాలను పరిశీలించి లేఅవుట్లకు సిద్ధం చేయాలని తహశీల్దార్ లక్ష్మీ నరసింహాను ఎంపిపి కోరారు. ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని మన ఎంఎల్‌ఎ విక్రమ్ రెడ్డి గడపగడపకు తిరుగుతూ ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. మాజీమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఎంఎల్‌ఎ పాలన సాగిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో మళ్లీ ప్రజలు ఆయనను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, వైస్ ఎంపిపి కంభంశెట్టి ప్రమీల, ఎంపిటిసిలు తోమాటి శశిధర్‌రెడ్డి, వేనమ్మ, సర్పంచులు, తహశీల్దార్ లక్ష్మీనరసింహ, ఎపిఒ శిరీష, విద్యుత్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.










