పూర్వపు ఖమ్మం జిల్లా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా వరరామచంద్రపురం మండలం సున్నంవారిగుడెంలో 1960 ఆగష్టు 8వ తేదీన జన్మించిన సున్నం రాజయ్య తాను బ్రతికినన్నాళ్ళు పేద, గిరిజన ప్రజల అభివద్ధికి తన జీవితాన్ని అర్పించిన త్యాగమూర్తి. సాధారణ కుటుంబంలో పుట్టి, పెరిగి, భద్రాచలం శాసనసభ్యుడుగా మూడు సార్లు (1999, 2004, 2014లో) ఎన్నికై, నిరాడంబరంగా జీవించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. పార్టీ సభ్యునిగా ప్రారంభమైన ప్రస్థానం భద్రాచలం డివిజన్, ఆ తరువాత ఖమ్మం జిల్లా, అనంతరం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యునిగా వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆయన కరోనా మహమ్మారి బారినపడి గత ఏడాది ఆగస్టు3న తనువు చాలించారు.
నిరంతరం తన నియోజకవర్గ అభివృద్ధి, గిరిజన ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజయ్య పోరాడారు. అటవీ ఉత్పత్తులకు న్యాయమైన ధర కోసం, ముఖ్యంగా తునికాకు సమస్యపై ఎంతగానో కృషి చేశారు. అసెంబ్లీలో గిరిజనుల సమస్యల్ని వినిపించిన ప్రజానాయకుడు. పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్చాలని, నిర్వాసితులకు న్యాయం జరగాలని, సరైన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 650 కి.మీ పాదయాత్ర చేశారు. 2000లో జరిగిన విద్యుత్ పోరాటంలో నిరవధిక నిరాహార దీక్ష చేయడంతోపాటు వివిధ ఆందోళనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో పాలకులను నిలదీయడం, వెలుపల ఉద్యమాల్లో పాల్గొనడం ఆయన పని శైలి. ముఖ్యమంత్రులతో సహా అధికార పార్టీల పెద్దలు తమలో కలుపుకునేందుకు పలు ప్రలోభాలు పెట్టినా, తాను కడవరకూ ఎర్ర జెండాతోనే ఉంటానని చెప్పి నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఎంతో పట్టుదలతో అలాగే నిలబడ్డ ధన్యజీవి సున్నం రాజయ్య. ఆయన ఆశయాల సాధన కోసం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుటమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి.
(నేడు సున్నం రాజయ్య ప్రథమ వర్ధంతి)...
రచయిత: ఐ.ప్రసాదరావు సెల్ 6305682733










