May 28,2023 16:16
  • విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలి
  • ఎంపీటీసీ నాగ చంద్రశేఖర్ రెడ్డి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : క్రీడలతో యువతకు మంచి భవిష్యత్తు ఉందని, విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించగలిగితే క్రీడల కోటా ద్వారా యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని ఊటుకూరు ఎంపీటీసీ నాగ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. ఆదివారం జిఎంసి కళ్యాణ మండపంలో ద్రోణాచార్య మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ సునీల్ ఆధ్వర్యంలో టైక్వాండో బెల్టు గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని తెలిపారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరి అని సూచించారు. మార్షల్ ఆర్ట్స్ సాధన వలన ఆరోగ్యము, మంచి శారీరక ఆకృతితో పాటు శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం లభిస్తుందని తెలిపారు. ఆత్మరక్షణే మార్షల్ ఆర్ట్స్ ప్రధాన లక్షమని తెలిపారు. తల్లిదండ్రులు మార్షల్ ఆర్ట్స్ పట్ల అవగాహన కలిగి పిల్లల్ని ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. గ్రాండ్ మాస్టర్ సునీల్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించిన బెల్ట్ గ్రేడింగులో 18 మంది క్రీడాకారులు వివిధ రకాల బెల్ట్ గ్రేడింగ్ లు సాధించారని తెలిపారు. అనంతరం బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ లో ఉత్తీర్ణులైన క్రీడాకారులకు నాగ చంద్రశేఖర్ రెడ్డి బెల్టులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ఉపాధ్యక్షులు బచోటి భాస్కర్, ప్రధాన కార్యదర్శి చౌడవరం నరసింహ, సంయుక్త కార్యదర్శులు ఉమాశంకర్, వర్ల నరసింహ, మాస్టర్లు కె.నాగరాజ, కె.గంగారాం, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.