- మాట వింటే హడలెత్తిపోతున్న గోదావరి పరీవాహక ప్రజలు
- కొండలు, గుట్టలపై తలదాచుకున్న ఘటనలు
- గతేడాది 71.3 అడుగులకు చేరిన నీటిమట్టం
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి : జులై మాసం వచ్చిందంటే గోదావరి పరీవాహక ప్రజలు హడలెత్తిపోతున్నారు. గోదావరి వరద ఉధృతితో ఇళ్లు వదిలి కొండలు, గుట్టలపైనే ప్రాణభయంతో తలదాచుకున్న ఘటనలు మళ్లీ పునరావృతవుతాయోనన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటివరకూ గోదావరికి జులైలోనే 11సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక, నాలుగు సార్లు తుది ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే గోదావరి నీటిమట్టం పెరగడంతో సమీప గ్రామాల ప్రజలు భయందోళనకు గురువుతున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పాలనా యంత్రాంగం ఇప్పటివరకూ అప్రమత్తం చేసే దిశగా చర్యలు చేపట్టకపోవటం గమనార్హం.
- జులైలోనే అత్యధిక సార్లు వరద పోటు
1953 నుంచి ఇప్పటి వరకూ గోదావరికి 30 సార్లు మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది. గోదావరి నది చరిత్రలో రికార్డు చేసిన వివరాల ప్రకారం 1953లో తొలిసారి 72.5 అడుగుల స్థాయిలో గోదావరికి వరదలు రావడంతో నది ఒడ్డున ఉన్న అనేక గ్రామాలు కొట్టుకుపోయాయి. 1986లో 74.6 అడుగుల రికార్డుస్థాయిలో వరద రావడంతో ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. సర్వం కోల్పోయిన అనేక గ్రామాల ప్రజలు మెరక ప్రాంతాల వైపు ఇళ్లు నిర్మించుకున్నారు. 1990లో 70.8 అడుగుల నీటిమట్టానికి వరద రావడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఖమ్మం జిల్లాలో పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు, వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, చింతూరు మండలాల్లోని గోదావరి పరీవాహక లోతట్టు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. జూలైలోనే గోదావరికి 11సార్లు తొలి ప్రమాద హెచ్చరికను దాటడమే కాక ఇందులో నాలుగుసార్లు తుది ప్రమాద హెచ్చరికను (53అడుగులు) సైతం దాటడం గమనార్హం. గతేడాది జూలై 16న భద్రాచలం వద్ద 71.3 అడుగుల నీటిమట్టం నమోదయ్యింది. 35 ఏళ్ల తర్వాత 70 అడుగుల మార్కును మరోసారి దాటింది.
1972 జూలై 6న 44.3 అడుగుల గోదావరి నీటిమట్టం నమోదైంది. 1976 జూలై 22న 63.9 అడుగులు, 1988 జూలై 29న 54.3, 2003 జూలై 27న 45.8, 2008 జూలై 6న 47.3, 2013 జూలై 19న 57, 2013 జూలై 24న 56.7, 2016 జూలై 12న 52.4 అడుగుల నీటిమట్టం నమోదైంది. 2022 జూలై 16న 71.3 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఆగస్టు 16, 1986లో 24.55 అడుగుల గరిష్ట నీటిమట్టం నమోదయ్యింది. ఆగస్టు 25, 1990న గరిష్టంగా 22.75 అడుగులు, ఆగస్టు 7, 2006న 22.80 అడుగులు, జులై 17, 2022న 21.70 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది.
- ఆందోళనలో పరీవాహక ప్రాంత ప్రజలు
ఏటపాక, విఆర్‌పురం, కూనవరం, చింతూరు మండలాలు గత ఏడాది పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. మండల కేంద్రాల్లో సైతం ఆరు నుంచి పది అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహించింది. పంట పొలాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. దీంతో పట్టణ ప్రజలు డాబాలపైకి, పల్లెల్లోని ప్రజలు కొండలపైకి వెళ్లి ప్రాణాలను కాపాడుకున్నారు. మూడు రోజుల నుంచి 20 రోజుల పాటు వరద ముంపు నెలకొంది. వరద బాధితులు తిరిగి ఇళ్లకు చేరుకునే నాటికి కొన్ని ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా మరికొన్ని శిథిలావస్థకు చేరాయి. ధవళేశ్వరం బ్యారేజీ ఎగువను ఉన్న సీతానగరం మండలంలోని ములకల్లంక గ్రామం పూర్తిగా నీట మునిగింది. దిగువన అయినవిల్లి మండలం ముక్తేశ్వరం వద్ద కాజ్‌వేపై, మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వే, పి.గన్నవరం మండలం చాకలిపాలెం కాజ్‌వేల వద్ద డేంజర్ బెల్స్‌మోగాయి. పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కోనసీమ - పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయిలంక కాజ్‌వే వరద నీటిలో మునిగిపోవటంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్, కోనసీమలోని కొన్ని బలహీన ఏటిగట్ల వద్ద ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి వరద పోటును కొంత మేర కట్టడి చేశారు. కోటిలింగాలపేట, శేషయ్యమెట్ట, ఆర్యాపురం, మల్లయ్యపేట, ధవళేశ్వరంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వరదల సమయంలో సీడబ్ల్యుసీ, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు చెందిన సిబ్బంది కీలకంగ వ్యవహరించాల్సి ఉంది. ఇతర శాఖలను సమన్వయం చేసుకుని ప్రజలను అప్రమత్తం చేయాల్సి ఉంది.










