ఎస్వీయూలో ప్రాచీన కోర్సులు కనుమరుగు
గొడ్డలి పెట్టుగా విభాగాల విలీన ప్రక్రియ
ప్రజాశక్తి - క్యాంపస్
ఉన్నత విద్యా మండలి అసంబద్ధ నిర్ణయాల వల్ల శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ప్రాచీన కోర్సులు కనుమరుగవుతున్నట్లు ఆయా విభాగాల పరిశోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వర్సిటీ స్థాపించినప్పుడు ఏర్పాటు చేసిన కొన్ని ప్రాచీన కోర్సులు కనుమరుగు కానుండడంతో పరిశోధకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు, యూజీసీ అనుమతిలేని కోర్సులకు పోస్టులు కేటాయించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్ట్స్ విభాగంలో చాలా కోర్సులను మెర్జి చేయడం లేదా దూరవిద్య విభాగానికి తరలించడం వివాదాస్పదంగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా యూనివర్సిటీనే నమ్ముకొని ఇక్కడ పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్లు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎస్వీయూలోని జనాభా విద్య విభాగంలో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఆ విభాగానికి లేకుండా చేశారు. ఉమెన్ స్టడీస్ సబ్జెక్టును పాపులేషన్ లో విలీనం చేయడం వల్ల పాపులేషన్ లో పూర్తిగా ఉద్యోగాలు లేకుండా చేశారు. ఈ విభాగం 1973వ సంవత్సరంలో ఏర్పడినది. అప్పట్నుంచి కొన్ని వేల మందికి విద్యా ఉపాధిని అందించినది. ఈ విభాగంలో మొత్తం 110మంది విద్యార్థులు పిహెచ్డీలు చేశారు. ఈ సంవత్సరంలో విభాగపు స్వర్ణోత్సవాలను జరుపుకుంది. అయితే 2009లో ఏర్పడిన ఉమెన్ స్టడీస్ ను ఈ విభాగంలో విలీనం చేయడం ద్వారా ఉన్న పోస్టులను ఆ విభాగానికే కేటాయించి పాపులేషన్‌కు అన్యాయం చేశారని వాపోయారు. అయితే ఉమెన్ స్టడీస్ కు యు జి సి అప్రూవల్ లేదు. అది ఒక ఎక్స్టెన్షన్ ప్రోగ్రాం మాత్రమే. యూజీసీ గుర్తింపు లేని సబ్జెక్టుకు ఎస్వీయూ ఉన్నతాధికారులు పోస్టులను కేటాయించడం ఎంతవరకు సమంజసం అని పరిశోధకులు ప్రశ్నిస్తున్నారు. పాపులేషన్ విభాగం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తప్ప ఆంధ్రప్రదేశ్లో మరెక్కడా లేదు. రాబోవు నోటిఫికేషన్ లో ఈ పోస్టులను పాపులేషన్ లో పిహెచ్డి చేసిన వాళ్లకే కేటాయించాలని అక్కడ విద్యార్థులు, పరిశోధకులు కోరుతున్నారు.










