ముంబయి : మహారాష్ట్ర ప్రభుత్వంపై శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 15 -20 రోజుల్లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బిజెపితో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఇప్పటికే డెత్ వారంట్ జారీ అయ్యిందని చెప్పారు. రాజ్యసభ సభ్యుడైన సంజయ్ రౌత్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉద్ధవ్ థాకరే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన షిండే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌తో సహా పలు పిటిషన్లపై తీర్పులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ తీర్పు కోసం తాము ఎదురుచూస్తున్నామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. 'ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి (ఏక్‌నాథ్ షిండే) ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 15-20 రోజుల్లో కూలిపోతుంది. ఈ ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయ్యింది. దానిపై ఎవరు సంతకం చేస్తారనేది నిర్ణయించాల్సి ఉంది' అని సంజయ్ రౌత్ అన్నారు. షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరిలో కూలిపోతుందని గతంలో కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
గతేడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు చేశారు. దీంతో సిఎం పదవికి ఉద్ధవ్ థాకరే రాజీనామా చేయడంతో.. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉన్న మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం ఏక్‌నాథ్ షిండే బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏక్‌నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఉద్ధవ్ థాకరే వర్గం దాఖలు చేసిన పిటిషన్లు, కౌంటర్‌గా షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వీటిపై తీర్పును గత నెలలో రిజర్వ్ చేసింది. మరో 15-20 రోజుల్లో ఈ తీర్పులను సుప్రీంకోర్టు వెల్లడించనున్నది.










