ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మహాశివరాత్రి పర్వదినము సందర్భంగా హత్యరాల పుణ్యక్షేత్రంలో రాజంపేట శ్రీ అన్నమయ్య కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పౌరాణిక విభిన్న రంగస్థల నాటక భక్తి రస ప్రదర్శనలను ప్రముఖ కళాకారులచే ప్రదర్శించనున్నారని అధ్యక్షుడు జబ్బిరెడ్డి వెంకట్రెడ్డి, ఆలయ చైర్మన్ వెలగచర్ల వెంకట సుబ్బారెడ్డి, దేవస్థాన ఎగ్జిక్యూటివ్ అధికారి కొండారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 19వ తేదీ ఆదివారం రాత్రి శ్రీ రామాంజనేయ యుద్ధము, చింతామణి నాటకం నుండి భవానీ సన్నివేశం, శ్రీకృష్ణ రాయబారం, బాలనాగమ్మ నాటకం నుండి కార్యవర్ధి సన్నివేశం వంటి ప్రదర్శనలతో పాటు సత్య హరిశ్చంద్ర పూర్తి నాటకాన్ని ప్రదర్శిస్తారని తెలిపారు. ఈ వేడుకల కార్యక్రమంలో భాగంగా నృత్య కళాకారిని సుమతి చే నృత్య ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని భక్తాదులతో పాటు రాజంపేట పుర ప్రజలు తిలకించి అంతరిస్తున్న నాటక రంగానికి పునర్జీవం పోయాల్సిందిగా ఆయన కోరారు.










