Oct 09,2023 11:24
  •  కృపమ్మ కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌

ప్రజాశక్తి-తాడేపల్లి (గుంటూరు జిల్లా) : వెట్టిచాకిరీ చేస్తున్న ఆశాల బతుకులు అభద్రతా వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అధికారుల వేధింపులు, పని ఒత్తిడి వల్ల మృతి చెందిన తాడేపల్లి ముగ్గురోడ్డుకు చెందిన ఆశ కార్యకర్త కృపమ్మ కుటుంబాన్ని సిపిఎం, సిఐటియు నాయకులతో కలిసి సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కృపమ్మ మరణించిన వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఆశాలు చూపిన పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా ఉండి విశ్రాంతి లేకుండా కష్టపడుతున్న ఆశాలకు ఇటువంటి ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులనే పేరుతో ఆశాలకు ప్రభుత్వ పథకాలు కోత పెట్టడం సరికాదన్నారు. కృపమ్మకు వృద్ధాప్యంలో ఉన్న తల్లి, పని చేయలేని భర్త, పిల్లలు ఉన్నారని తెలిపారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దఎత్తున పోరాటం తరువాత ప్రభుత్వం రూ.పది లక్షలు, ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పిన సంగతిని గుర్తు చేశారు. పోరాడితేనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మిని ఉదయం ఆరు గంటలకే బలవంతంగా అరెస్టు చేసి మధ్యాహ్నం వరకు ఏ స్టేషన్‌లో ఉంచారో తెలియనీయకుండా గోప్యత పాటించడాన్ని ఖండించారు. ఆమెను ఆరెస్ట్‌ చేసిన మరో గంట వ్యవధిలోనే సిఐటియు జిల్లా, స్థానిక నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారన్నారు. బహుళ జాతి కంపెనీల్లో పని చేస్తున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటితో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం తన ప్రచారానికి వాడుకుంటున్న ఆశాల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఆశాలకు ఇస్తున్న రూ.పది వేలు ఎలా సరిపోతుందో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. కనీస రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆశ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, సిఐటియు తాడేపల్లి పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు, నాయకులు జొన్నా శివశంకరరావు, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, డివి భాస్కరరెడ్డి, ఆశాలు కె లక్ష్మి, వి రేణుక, సుగుణ, మేరి తదితరులు పాల్గొన్నారు.