స్పష్టంగా బిజెపి వ్యతిరేక పవనాలు : కర్నాటక సిపిఎం కార్యదర్శివర్గ సభ్యులు ప్రకాశ్
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కర్నాటక సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ప్రకాశ్ పేర్కొన్నారు. అవినీతి, మతత్వం, వ్యవసాయ రంగ నిర్లక్ష్యం, కార్పొరేటీకరణ వైపుసాగుతున్న ఈ సర్కారు పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపికి ఓటమి తప్పదన్నది స్పష్టమవుతోందని చెప్పారు. అందుకే ఆ పార్టీ టిక్కెట్ల విషయంలోనూ గందరగోళం నెలకొంది. అనేక మంది రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగానున్న వ్యక్తి సైతం రాజీనామ చేశారని తెలిపారు. కర్నాటక రాజకీయాలపై 'ప్రజాశక్తి'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో ప్రకాశ్ మాట్లాడారు.. ఆయన మాటల్లోనే పలు విషయాలను తెలుసుకుందాం..
- చరిత్రలో ఎప్పుడూలేనంత అవినీతిమయం
కర్నాటక రాష్ట్ర 40 ఏళ్ల చరిత్రలో కనివినీ ఎరుగనంతగా అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలున్నాయి. ఇదేదో ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలు కాదు... సాక్షాత్తు కాంట్రాక్టర్ అసోషియేషన్ ప్రెసిడెంట్ కెంపన్న చెప్పిన మాటలు. ప్రతి పనిలో 40 శాతం కమీషన్లు ఇస్తేగానీ పనిచేయలేకున్నామని ఆయన నేరుగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకే లేఖ రాయడం గమనార్హం. కమీషన్లు ఇచ్చుకుని, సకాలంలో బిల్లులూ రాక ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన మోహన్‌దాస్‌పై సైతం ఇటువంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. తాను ఇంత అవినీతిమయమైన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఈ ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి పెరిగిందన్నది స్పష్టమవుతోంది. ఇవే కాకుండా సబ్ ఇన్స్‌పెక్టర్ల నియామకాల్లోనూ, బిట్‌కాయిన్ ఇలా అనేక అవినీతి ఆరోపణలు ఈ ప్రభుత్వంపై వచ్చాయి. వీటి పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.
- మతత్వ విధానాలు
ప్రజల మధ్య విధ్వేషాగ్నిని రగిల్చి ప్రజల మధ్య చీలిక తీసుకొచ్చే ఎత్తుగడను కర్నాటక రాష్ట్రంలో బిజెపి ఒక స్పష్టమైన ప్రణాళికతో చేస్తోంది. పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తోంది. అదే విధంగా ఇక్కడున్న టిప్పుసుల్తాన్, సవర్కర్‌కు లింకుపెట్టి మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేస్తోంది. గోవధ నిషేధం పేరుతో మైనార్టీ వర్గాలపై దాడులకు పూనుకునేందుకు వీలుగా మతత్వ మూకలకు స్వేచ్ఛను ఇస్తోంది. దేవాలయాలు, మఠాలకు నిధులు కేటాయించి మత విధానాలను మరింతగా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తోంది. వరదల్లో 42 వేల పాఠశాలల బిల్డింగులు దెబ్బతింటే వీటి బాగుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు రూ.500 కోట్లు. ఇదే సమయంలో దేవాలయాలు, మఠాలకు ఖర్చు పెట్టింది వెయ్యి కోట్ల రూపాయలు. దీన్ని బట్టి ఈ ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఏది ఉందన్నది స్పష్టమవుతుంది.
- కర్నాటక అస్థిత్వాన్ని దెబ్బతీస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్
డబుల్ ఇంజిన్ సర్కారు పేరుతో కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వముంటే అభివృద్ధి పరుగులు తీస్తుందని బిజెపి ప్రచారం చేసింది. అభివృద్ధి ఏమోగాని కర్నాటక అస్థిత్వాన్ని దెబ్బతీస్తోందన్న అభిప్రాయం ఈ రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తోంది. కర్నాటకలో ప్రత్యేకంగానున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, విజయ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను నష్టాల్లోనున్న ఇతర బ్యాంకుల్లో విలీనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల్లో ఇది వరకు కర్నాటకలోనున్న వాటికి తీసేసి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే పెట్టారు. దీంతో ఈ ప్రాంతవాసులు నష్టపోతున్నారు. ఇంత నష్టం జరుగుతున్నా ఇక్కడి నుంచి 26 మంది పార్లమెంట్ సభ్యులు బిజెపికి ఎన్నికైనా ఏ ఒక్కరూ పెదవి విప్పడం లేదు. కర్నాటకలోని బిజెపి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెదవి విప్పడం లేదు. మౌనంగా కేంద్రం చెప్పినట్టు చేసుకుపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి పన్నుల రూపంలో రావాల్సిన రూ.50 వేల కోట్టు రాకపోయినా ఈ ప్రభుత్వం మౌనంగా ఉంది. ఈ రకంగా డబుల్ ఇంజిన్ సర్కారు కర్నాటకకు లాభం కంటే నష్టాన్నే ఎక్కువగా చేస్తోంది.
- వ్వవసాయానికి పూర్తిగా నిర్లక్ష్యం
వ్యవసాయ రంగాన్ని ఈప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇదివరకు భూ సీలింగ్ చట్టం, భూ సంస్కరణ చట్టాలను సైతం సవరించారు. రైతుల నుంచి భూములు లాక్కుని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు వీలుగా చట్టాల్లో మార్పులను తీసుకొచ్చారు. అంతేకాకుండ వ్యవసాయ కూలీలకు తీరని నష్టం చేకూరుస్తోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది. అంతకు మునుపు ఏడాది వరకు రాష్ట్రంలో సగటు కూలీల పనిదినాలు 49.6 శాతముండేది. ఇప్పుడు అది 40.8 శాతానికి పడిపోయింది. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు నష్టం చేకూరుస్తోందన్నది స్పష్టమవుతోంది.
- బిజెపికి బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధం
అన్ని రకాలుగా విఫలమైన బిజెపి సర్కారుకు కర్నాటకవాసులు బుద్ధి చెప్పేందుకు సిద్ధమై ఉన్నారు. 40 ఏళ్ల కర్నాటక రాజకీయ చరిత్ర చూసుకున్నా ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ మరోమారు రాదు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు వస్తే, బిజెపికి 36 శాతం మాత్రమే ఓట్లు వచ్చారు. ఆ తరువాత ఆపరేషన్ కమల్ పేరుతో ఇతర పార్టీల్లోని వారిని తమ వైపు తీసుకుని అధికారపగ్గాలు చేపట్టింది. చేపట్టిన తరువాత పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. ఈ ప్రభుత్వాన్ని 40 శాతం(కమీషన్) ప్రభుత్వంగా పిలుస్తున్నారు. ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. అందుకే ప్రజా వ్యతిరేకత బిజెపి పట్ల అత్యధికంగా ఉంది.










