Apr 17,2023 14:42
  • ప్రచార భేరిలో వామపక్షాలు

ప్రజాశక్తి-రాజంపేట : రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న బిజెపిని దేశం నుండి తరిమికొట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శివరామకృష్ణ దేవరలు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా దేశంలో ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగిస్తున్న బిజెపిని తరిమికొట్టాలని దేశవ్యాప్తంగా సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ప్రచార భేరి మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం పాత బస్టాండులో ప్రకటించి బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సి.రవికుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి శివరామకృష్ణ దేవర మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రతీ వ్యక్తి గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. మోడీ, అమిత్ షాల నాయకత్వంలో బిజెపి-ఆర్ఎస్ఎస్ కూటమి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండవలసిన ప్రజలనుధ్య మత విద్వేషపు చిచ్చు రాజేస్తున్నదని తెలిపారు. ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ నిరంకుశంగా అణచివేస్తున్నారని అన్నారు. అందరి ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకుల్ని, ప్రజలు కట్టిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వరంగ పరిశ్రమల్ని, ఓడరేవుల్ని., చివరికి అందరికీ అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం కార్పొరేట్లకు మోడీ ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని తెలిపారు.  కరెంటు బిల్లులు ముట్టుకుంటేనే షాకులు కొడుతున్నాయని.. పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మన బతుకుల్లో మంటలు రాజేస్తున్నాయని అన్నారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మణి, సుబ్బరాయుడు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.