ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అంగన్వాడీలకు ముఖ ఆధారిత హాజరు నుంచి మినహాయించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం మాత మరియు శశి సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సందర్భంగా చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం రూ 26 వేలు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను ఆయాలతో భర్తీ చేయాలని అన్నారు. ఐదు సంవత్సరాల టీ.ఏ,డీ.ఏ మంజూరు చేయాలని., ఉద్యోగ విరమణ అనంతరం కార్యకర్తలకు రూ 5 లక్షలు, ఆయాలకు రూ 3 లక్షలు ఇవ్వాలని కోరారు. అంగన్వాడి కేంద్రాలలో రాజకీయ జోక్యం తగ్గించాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కంటే వేయి రూపాయలు అదనంగా వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు గడిచిపోయినా కార్యకర్తలకు రూ 11,500లకే వేతనాన్ని పరిమితి చేశారని తెలిపారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు రూ 13600 లు వేతనం అందిస్తోందని, ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం గత వేతనాన్నే కొనసాగిస్తున్నారని అన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పెనగలూరు మండల కార్యదర్శి మద్దెల ప్రసాద్, అంగన్వాడీ కార్యకర్తలు ఎం.ఈశ్వరమ్మ, పి.వి శివరంజని, ఎస్.అమరావతి, ఎం.విజయమ్మ, షకీలా భాను, చెంచులక్ష్మి, శిరీష, అన్నపూర్ణమ్మ, వనిత, సునీత, రేవతి తదితరులు పాల్గొన్నారు.










