Jul 16,2022 21:26
  • బాలలపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న ఆరోగ్య నిపుణులు

న్యూయార్క్‌ : కరోనా మహమ్మారి, మూఢ విశ్వాసాల వల్ల ప్రపంచవ్యాప్తంగా గతేడాది 2.5 కోట్ల మంది చిన్నారులకు టీకాలు అందలేదు. ప్రాణాంతక వ్యాధుల బారి నుంచి చిన్నారులను రక్షించేందుకు ఉపయోగపడే వ్యాక్సిన్‌ను సకాలంలో అందించక పోవడం వల్ల భవిష్యత్తులో వారి జీవితంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. యూనిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 177 దేశాల జాతీయ ఆరోగ్య సేవల డేటాను సేకరించి ఈ నిర్ధారణకు వచ్చారు.
టీకాకు నోచుకోని పిల్లల సంఖ్య 2020 ఏడాదితో పోలిస్తే 2021లో 20 లక్షలు అధికంగా ఉన్నది. కరోనా మహమ్మారికి ముందు ఏడాది 2019తో పోలిస్తే ఇది 60 లక్షలు ఎక్కువగా ఉండటం గమనార్హం. '' ఇది పిల్లల ఆరోగ్యానికి ప్రమాద హెచ్చరిక. ఒక తరంలో బాల్య నిరోధక టీకాలలో అతిపెద్ద తగ్గుదల నమోదు కావడం ఇదే ప్రథమం అని యూనిసెఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కేథరీన్‌ రస్సెల్స్‌ వివరించారు. టీకాలు అందని 2.5 కోట్ల మంది చిన్నారుల్లో 1.8 కోట్ల మందికి 2021లో డిటిపి డోస్‌ ఒక్కటి కూడా అందలేదు. వీరిలో అత్యధిక శాతం మంది అల్పాదాయ వర్గాలకు చెందినవారే ఉన్నారని యునిసెఫ్‌ తెలిపింది. సింగిల్‌ డోస్‌ కూడా అందని పిల్లలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ కూడా ఉండడం గమనార్హం. ఈ విషయంలో ఇథియోపియా, ఇండొనేషియా, నైజీరియా, ఫిలిప్పైన్స్‌ వంటి దేశాల సరసన భారత్‌ నిలిచింది.
కోవిడ్‌ వణికించిన 2020 సంవత్సరంతో పోల్చితే 2021లో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని ఆశించినప్పటికీ.. పరిస్థితి మరింతగా దిగజారటం గమనార్హం. కోవిడ్‌ లాక్‌డౌన్లు, ఆర్థిక మాంద్యం, టీకాలపై అపోహలు, అసత్య ప్రచారం వంటివి టీకాల కార్యక్రమానికి పెద్ద అవరోధాలుగా నిలిచాయని యూనిసెఫ్‌ వివరించింది. పిల్లలకు రోగనిరోధక టీకాలు అందకపోవడంతో బాటు, ఆకలి సంక్షోభం కూడా పెరుగుతుందడంతో పిల్లల మనుగడకే ముప్పు వాటిల్లుతుందని యునిసెఫ్‌ పేర్కొంది.
ఈ 'చారిత్రక వెనుకబాటుతనం' ఆందోళన కలిగిస్తున్నదని నిపుణులు చెప్పారు. తీవ్రమైన పోషకాహార లోపం పెరగటం, పోషకాహార లోపం ఉన్న పిల్లలు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉంటారని తెలిపారు. మీజిల్స్‌ వంటి ఇన్ఫెక్షన్లు తరచూ వారికి ప్రాణాంతకంగా మారుతాయని హెచ్చరించారు.