- వివరాలు వెల్లడించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ప్రజాశక్తి - రాయచోటి టౌన్ (అన్నమయ్య జిల్లా) : గత కొంతకాలంగా దాదాపు 44 కేసులకు సంబంధించి 632.08 కేజీల గంజాయి ధ్వంసం చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని శేట్టివాండ్లపల్లి రోడ్డు మార్గంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో పట్టుబడిన గంజాయిని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా స్వాధీనం చేసుకున్న గంజాయిని ధ్వంసం చేయడం జరిగిందని జిల్లాలో గంజాయి అక్రమ రవాణా కింద పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారని పట్టుబడిన 44 కేసులకు సంబంధించి 632.08 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని దీని విలువ సుమారు రూ.94,81,200/- ఉంటుందని దీన్ని పూర్తిగా అగ్నికి ఆహుతి చేశామన్నారు. గంజాయి యువత పట్ల దుష్ప్రభావం చూపుతాయని కావున యువత చెడు వ్యసనాల ద్వారా బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోకూడదని ప్రతి ఒక్కరూ గంజాయి నుండి సమాజాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఎక్కడైనా గంజాయి అక్రమ రవాణా గంజాయి వాడడం వంటి సమాచారం పోలీసులకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ డాక్టర్ రాజ్ కమల్, డిఎస్పి శ్రీధర్, శ్రీనివాసరావు, సిఐలు, ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










