Sep 05,2023 22:03

చెరుకూరి తరుణ్‌


సామాజిక సేవ, బాలబాలికల విద్యకు తోడ్పాటుతో గుర్తింపు
'ఇండస్‌ యాక్షన్‌' ద్వారా పలు సేవా కార్యక్రమాలు

ప్రజాశక్తి - విజయవాడ అర్బన్‌ : విభిన్న ఆలోచనలకుతోడు గొప్ప సాంకేతికతను ఉపయోగించి సమాజంలో అద్భుతాలు సష్టిస్తున్నారు విజయవాడకు చెందిన చెరుకూరి తరుణ్‌. ఇండస్‌ యాక్షన్‌ సంస్థ సీఈవోగా ఉన్న తరుణ్‌.. ఇటీవల ప్రఖ్యాత అశోకా ఎస్పైర్‌-2023 అవార్డుకు ఎంపికై అరుదైన ఘనత సాధించారు. మొత్తం సుమారు 4 వేల మంది సామాజిక వేత్తల సేవలను పరిశీలించి వారిలో 11 మందిని ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అవార్డుకు ఎంపికైన వారి జాబితాలో మన తెలుగు తేజం, విజయవాడకు చెందిన చెరుకూరి తరుణ్‌ పేరు రెండో స్థానంలో ఉండటం విశేషం. మొదటి స్థానంలో సమినా బానో ఉన్నారు. తరుణ్‌ గత కొన్నేళ్లుగా తన సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా సేవలందిస్తున్న తరుణ్‌.. 2015లో హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎమర్జింగ్‌ గ్లోబల్‌ లీడర్‌ అవార్డును అందుకున్నారు. 2019లో ఒబామా ఫౌండేషన్‌ అవార్డు స్వీకరించారు. 2022లో అమెరికాకు చెందిన లెగో ఫౌండేషన్‌ చేపట్టిన ''బిల్డ్‌ ఏ వరల్డ్‌ ఆఫ్‌ ప్లే ఛాలెంజ్‌''కు తరుణ సంస్థ ఇండస్‌ యాక్షన్‌ ఎంపికైంది. అంతే కాకుండా.. లెగో ఫౌండేషన్‌ వారు.. ఆరేళ్లలోపు పిల్లల సంరక్షణ నిమిత్తం లెగో ఫౌండేషన్‌ వారు తరుణ్‌ సంస్థకు రూ.8.3 కోట్ల నిధులను అందజేశారు. తన కుమారుడు తరుణ్‌ అశోకా ఎస్పైర్‌ అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఆయన తండ్రి అజరుకుమార్‌ చెరుకూరి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తరుణ్‌కు పలువురు అభినందించారు.
విద్యా హక్కు చట్టం అమలుకు 20 రాష్ట్ర్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు
ఇండస్‌ యాక్షన్‌ సంస్థను 2013లో తరుణ్‌ చెరుకూరి ప్రారంభించారు. అప్పటి నుంచి బాలబాలికల విద్యకు తరుణ్‌ కషి చేస్తున్నారు. బడి ఫీజులు చెల్లించలేని పరిస్థిత్తులో ఏ పిల్లవాడు ఉండకూడదని... కేంద్రం 2009లో ప్రకటించిన విద్యా హక్కు చట్టం అమలుకు దాదాపు 20 రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సంస్థ ఆధ్వర్యంలో 5.8 లక్షల మంది పిల్లలకు ఫీజులు చెల్లించి ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించారు. ఈ సంస్థకు దేశ వ్యాప్తంగా దాదాపు 50 వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు.