చేతిపంపు బోర్లు ఏర్పాటు చేయాలి
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణం 36వ వార్డు చెరువుకట్ట గిరిజన కాలనీ ప్రజలు తమ కాలనీలో రెండు బోర్లు ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం ఆర్‌డిఒ వి.కె.శీనా నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తాము సుమారు 30 సంవత్సరాల నుండి పాచి పనులు, బేల్దారి పనులు, చేతివృత్తులు చేసుకొని జీవించే పేదవారమని సుమారు 120 కుటుంబాలు నివాసముంటున్నామని తెలిపారు. తమ కాలనీకి ప్రభుత్వం కరెంట్ వసతి కల్పించిందని ఒక బోరు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ బోరులో సక్రమంగా నీళ్లు రావడంలేదని అరకొర నీళ్లు వస్తున్నాయని అవి కూడా మట్టితో కలుషితమైన నీళ్లు వస్తున్నందున నీళ్లకు ఈ కాలనీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ వేసవిలో ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాబట్టి నీటిసమస్యను తీర్చేందుకు తమ కాలనీలో వెంటనే రెండు బోర్లు ఏర్పాటు వేయించి సమస్యను తీర్చాలని ఆర్‌డిఒను ప్రజలు కోరారు. అందుకు ఆర్‌డిఒ స్పందిస్తూ తప్పకుండా సమస్యను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య, నాయకులు ఎం.వెంకటేశ్వర్లు, నంబూరి రమణయ్య, పి.భవాని, రాపూరి జ్యోతి, షేక్.బాబులు స్థానికులు పాల్గొన్నారు.










