Nov 14,2023 21:16

విక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర పేరిట బిజెపి ప్రచారం

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  చేసిన మోసం సరిపోదన్నట్టుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరో మోసకారి ప్రచారానికి తెరలేపింది. 'విక్షిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర' పేరిట కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే పేరుతో గిరిజనులను మభ్యపెట్టి, ఎన్నికల అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు సన్నద్ధమౌతుంది. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రం నుంచి ఈ ప్రచార కార్యక్రమానికి బుధవారం శ్రీకారం చుట్టనుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టి సుమారు తొమ్మిదిన్నరేళ్లు కావస్తున్న విషయం విధితమే. ఏటా కోటి ఉద్యోగాలు, సగటు ఆదాయం రెట్టింపు, మహిళా సాధికారత, నల్లధనం వెలికితీత, వెలికి తీసిన నల్లధనమంతా ప్రజలకు పంపకం వంటి ఎన్నో హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో ఏ ఒక్కటీ నెరవేరలేదు. కనీసం రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలైనా నెరవేర్చకపోతుందా అని ఎదురు చూసినవారికి నిరాశే ఎదురైంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ లేదు. ఉత్తరాంధ్రకు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ రెండేళ్లకే ఎత్తుగట్టారు. విశాఖ రైల్వే జోన్‌ ఊసేలేదు. ఉన్న వాల్తేరు డివిజన్‌కు ఎసరుపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మన జిల్లాకు ప్రకటించిన గిరిజన విశ్వవిద్యాలయానికి నేటికీ సొంత భవన సముదాయం నిర్మించలేదు. పైగా ఉత్తరాంధ్ర గుండె చప్పుడు లాంటి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తహతహ లాడుతోంది.
ముఖ్యంగా కొండకొనల్లో నిక్షిప్తమైవున్న బాక్సైట్‌, గ్రానైట్‌ తదితర గనులను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టేందుకు గిరిజనులను అడవి నుంచి దూరం చేసేందుకు బిజెఎపి ప్రభుత్వం ప్రయత్నించింది. అందులో భాగంగానే సాలూరు మండలం తామరకొండ, పార్వతీపురంలోని బోడికొండలోని బాక్సైట్‌ను వేర్వేరు కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నించింది. సిపిఎం, ఎపి గిరిజన సంఘం ఆధ్వర్యాన పెద్దఎత్తున పోరాడడంతో తాత్కాలికంగా వెనక్కి తగ్గినప్పటికీ ఇంకా బిజెపి ప్రభుత్వం నుంచి ముప్పు పొంచివుంది. అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికీ 10ఎకరాల వరకు పోడు భూములు ఇవ్వాల్సివున్నప్పటికీ బిజెపి అధికారంలోకి
వచ్చాక మీనమేషాలు లెక్కిస్తోంది. మన్యం జిల్లాలో ఇంకా వేలాది గిరిజన కుటుంబాలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదు.
ఇచ్చిన చోట కూడా 2ఎకరాల నుంచి 2.50ఎకరాలకు మించి ఇవ్వడం లేదు. గిరిజన ప్రాంత భూములు గిరిజనేతరుల పరం కాకుండా రూపొందించిన 1/70 చట్టాలను సైతం నీరుగార్చే వివిధగా అనేక బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేపెట్టింది. గిరిజన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. దీంతో, గిరిజనులు నిత్యం సంతల్లో దోపిడీకి గురౌతున్న విషయం విధితమే. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా గిరిజనుల్లో బిజెపిపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. మన జిల్లాలో బిజెపికి ఏమంత బలం లేకపోయినప్పటికీ తన రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే మన్యం జిల్లాను తొలి విడత ప్రచార జాబితాలో చేర్చింది. గిరిజనులకు చెప్పుకునేందుకు కూడా ఏమీ లేకపోవడంతో ప్రధాన మంత్రి జీవన జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన, ఫోషన్‌ శక్తి నిర్మాన్‌ అభియాన్‌, జన్‌ధన్‌ యోజన, ఉజ్వల తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారంతో గిరిజనులను మభ్యపెట్టేందుకు ప్రచారం చేసేందుకు సన్నద్ధమైంది.
జిల్లాకు రెండు ఐఇసి వ్యాన్లు
సంకల్ప యాత్ర కోసం మన్యం జిల్లాకు రెండు ఐఇసి వ్యాన్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. అందులో అధునాతన సాంకేతిక పరికరాలతో కూడిన ఆడియో, వీడియో పరికరాలు ఉంటాయి. వాటి ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని ప్రజలకు వినిపిస్తారు. వీటిపాటు మొత్తం 17 పథకాలతో కూడిన ప్రచార సామగ్రిని సిద్ధం చేశారు. కరపత్రాలు, బ్రోచర్లు గిరిజనులకు విరివిరిగా పంపిణీ చేసి గిరిజనులను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇందులో బిజెపి లేదా ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు కూడా పాల్గొని వారి అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసింది.
రోజుకు రెండు పంచాయతీల్లో ప్రచారం
రోజూ రెండు పంచాయతీల్లో సంకల్ప యాత్ర సాగే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని 27 పంచాయతీల్లో ఈనెల 15 నుండి 30 వరకు, కురుపాం మండలంలోని 23 పంచాయతీల్లో డిసెంబరు 1 నుండి 15వరకు, సీతంపేట మండలంలోని 53 పంచాయతీల్లో ఈనెల 15నుంచి డిసెంబరు 16వరకు షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తున్నట్టు ఇటీవలే కలెక్టర్‌ ప్రకటించారు. ఈ యాత్రలో డిపిఒ జిల్లా నోడల్‌ అధికారిగా, డిఎంహెచ్‌ఒ, డిఎస్‌ఒ, డిఆర్‌డిఎ, హౌసింగ్‌ పీడీలు, పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజరు, జిల్లా వ్యవసాయఅధికారి, జిల్లా ఉద్యానఅధికారి, జిల్లా మత్స్యఅధికారి, ఐసిడిఎస్‌ పిఒ, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎస్‌ఇ పాల్గొంటారని సమాచారం.