Apr 27,2023 08:39

ధర్మవరం వన్‌ టౌన్‌ పోలీసుస్టేషన్లో నిరసన తెలుపుతున్న ఏపీచేనేత కార్మిక సంఘం, రైతుసంఘం నాయకులు

         ధర్మవరం టౌన్‌ : ముఖ్యమంత్రి వైస్‌.జగన్మోహన్‌రెడ్డి నార్పల పర్యటనకు వస్తున్న సందర్భంగా ఏపీ చేనేత కార్మిక సంఘం, రైతుసంఘం నాయకులను బుధవారం ఉదయం పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలా రామాంజినేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకాచలపతి, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్నలను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పిన తమను ముందస్తు అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. చేనేత కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని ఎన్నికల ముందు సాధ్యం కానీ హామీలు గుప్పించి వాటిని నేటికీ నెరవేర్చలేదన్నారు. వీటిని ప్రశ్నించడానికి వెళ్తున్న తమను అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరన్నారు. చేనేతల సమస్యలను పరిష్కరించేంత వరకు దశల వారీగా ఉద్యమాలు చేపడుతామన్నారు.