- పాత బకాయి రూ.50 కోట్లు చూపుతూ రూ.1000 కోట్ల సరుకు దిగ్బంధనం
- స్టీల్‌ప్లాంట్ ఉసురు తీసేందుకు బిజెపి సరికొత్త కుట్ర
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రంలోని బిజెపి సర్కారు కుట్రలకు పాల్పడుతోంది. అవసరమైన నిధులు ఇవ్వకుండా, ముడిసరుకును రానివ్వకుండా అవాంతరాలు కలిగించడమే పనిగా పెట్టుకుంది. అదానీ గంగవరం పోర్టుకు పాత బకాయి రూ.50 కోట్లు స్టీల్‌ప్లాంట్ చెల్లించాలన్న ఒకే ఒక కారణంతో వారం రోజులుగా రూ.1000 కోట్ల విలువైన (రష్యా, అమెరికా నుంచి వచ్చిన) 2.65 లక్షల టన్నుల కోకింగ్ కోల్‌ను స్టీల్‌ప్లాంట్‌కు ఈ పోర్టు నుంచి విడుదల చేయనీయకుండా కేంద్రంలోని మోడీ సర్కారు ఆటంకాలు సృష్టిస్తోంది. ప్లాంట్‌కు పంపించడానికి కన్వేయర్ బెల్టులు సరిగ్గా లేవనే సాకును తాజాగా చూపింది. కేంద్ర ప్రభుత్వ కుట్రల్లో అదానీ గంగవరం పోర్టు భాగస్వామ్యమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 25న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ కొంచెం పూర్తయిందని, వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కూడా చేయాల్సి ఉందని ప్రకటించారు. దీంతో, ఈ ప్లాంట్ పీకనులిమి చంపెయ్యాలన్న ఘోరమైన ప్రణాళిక వెల్లడవుతోంది.
- స్టీల్‌ప్లాంట్‌లో కోకింగ్ కోల్ ఎంత ఉంది?
బుధవారం నాటికి వైజాగ్ స్టీల్‌ప్లాంట్ వద్ద కేవలం 25 వేల టన్నులే కోకింగ్ కోల్ ఉంది. రోజుకు 11 వేల టన్నులు అవసరం. అంటే, రెండు రోజులకే ఇది సరిపోతుంది. ముడిసరుకు అందుబాటులో లేకపోతే మూడో రోజు నుంచి ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తుంది. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా, స్టీల్‌ప్లాంట్ గోడ పక్కనే ఉన్న గంగవరం పోర్టు నుంచి రావాల్సిన కోకింగ్ కోల్‌ను రానీయకుండా కేంద్ర ప్రభుత్వం మోకాలడ్డుతోంది. గడిచిన మూడు రోజులుగా ఒకసారి 1,300 టన్నులు, మరోసారి 2,500 టన్నులు మాత్రమే ప్లాంట్‌కు పంపింది. ప్లాంట్‌కు గంగవరం నుంచి రోజుకు రెండు కన్వేయర్ బెల్టుల ద్వారా 16 వేల టన్నులు రావాలి. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్ర ప్రయివేటీకరణ స్కెచ్‌లో గంగవరం పోర్టు యాజమాన్యం భాగస్వామ్యమై రా మెటీరియల్‌ను అందనీయకుండా చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జులై 26 వరకూ రూ.56.85 కోట్లు అంటే, నెలకు దాదాపు రూ.15 కోట్లు గంగవరం పోర్టుకు స్టీల్‌ప్లాంట్ చెల్లిస్తూ వచ్చింది. గతంలో ఎన్నడూ పోర్టుకు బకాయి ఉన్న పరిస్థితి లేదు. అయితే, కేంద్ర విధానం వల్ల రూ.50 కోట్లు బకాయిపడింది. కేంద్రం కుట్రలతో స్టీల్‌ప్లాంట్ రూ.180 కోట్ల జిఎస్‌టి కట్టలేక డిఫాల్టర్ అయింది. ప్లాంట్ ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఉద్యోగులు, కార్మికుల జీత భత్యాలకు సైతం స్టీల్‌ప్లాంట్ ఆర్థిక పరిస్థితి ఈ నెలలో అనువుగా లేదన్న ఆందోళన ప్లాంట్ ఉన్నతాధికారులను తాజాగా కలవరపరుస్తోంది.
- రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి : ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జె.అయోధ్యరాం
స్టీల్‌ప్లాంట్ వద్ద 1100 ఎకరాలు తీసుకున్న గంగవరం పోర్టు కేవలం రూ.50 కోట్ల పాత బకాయి కోసం రూ.1000 కోట్ల విలువైన లక్షల టన్నుల కోకింగ్ కోల్ ఇవ్వనడంపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ఉత్తరాంధ్ర ప్రాంత ఎంపిలు కేంద్రాన్ని నిలదీయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరాం కోరారు. ఈ మేరకు బుధవారం రాత్రి మీడియాకు ఒక వీడియో విడుదల చేశారు. గంగవరం పోర్టు చర్యలను తప్పుపట్టారు. భూములిచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా 10.45 శాతం ఉండేదని. వైసిపి ప్రభుత్వం ఈ వాటాను గంగవరం పోర్టుకు అమ్మేయడంతో ఈ దుస్థితి ప్లాంట్‌కు వచ్చిందని పేర్కొన్నారు. ప్లాంట్‌తో పోర్టు వ్యాపారం 80 శాతం ఆధారపడి ఉన్నందున రాజకీయ కుట్రలకు పోర్టు యాజమాన్యం తలొగ్గకుండా నిజాయితీగా వ్యవహరించాలని, రా మెటీరియల్‌ను విడవాలని ఆయన డిమాండ్ చేశారు.










