ప్రజాశక్తి - కృష్ణాప్రతినిధి
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వే ప్రక్రియ వేగంగా ముందుకు సాగడం లేదు. జిల్లాలోని 502 గ్రామాల్లో 8,83,440 ఎకరాల్లో రీ సర్వే నిర్వహించాల్సి ఉండగా, 19 నెలల్లో 154 గ్రామాల్లో మాత్రమే పూర్తయింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మూడో దశలో మరో 136 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయడానికి జిల్లా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే మిగిలిన 212 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతోందో తెలియని పరిస్థితి నెలకొంది.
భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం 100 సంవత్సరాల తర్వాత భూముల రీ సర్వేను నిర్వహిస్తున్నట్లు చెబుతోంది. తొలుత జిల్లాలోని పైలెట్ గ్రామాల్లో, ఆ తర్వాత మొదటి దశలో 103 గ్రామాల్లో 78,100 ఎకరాలు, రెండో దశలో 62 గ్రామాల్లో రీసర్వే నిర్వహించాల్సి ఉంది. అయితే 51 గ్రామాల్లో 58,844 ఎకరాల విస్తీర్ణంలో సర్వేను పూర్తి చేశారు. రీ సర్వే పూర్తయిన గ్రామాలకు 13 నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. రెండో దశలో మిగిలిన 11 గ్రామాలతోపాటు మరో 125 గ్రామాల్లో రీ సర్వేను డిసెంబర్ నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సర్వే నిర్వహించాల్సిన గ్రామాల్లోని రెవెన్యూ రికార్డులను ఫ్యూరిఫికేషన్ (స్వచ్ఛీకరణ) పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లో ఇప్పటికే డ్రోన్ ఫ్లయింగ్ పూర్తవ్వడంతో ఆర్ధోరిక్టిఫై ఇమేజ్ (ఒఆర్‌ఐ)లు సిద్ధం చేశారు. ఆయా గ్రామల్లో గ్రౌండ్ ట్రూతింగ్ (భూ యజమాని డాక్యుమెంట్ల పరిశీలన), గ్రౌండ్ వాలిడేషన్ (భూమి విస్తీర్ణం నిర్దారణ) ప్రక్రియను నిర్వహిస్తున్నారు.
399 విలేజ్ సర్వేయర్లు
రీ సర్వేలో డ్రోన్ ప్లేయింగ్ ప్రక్రియ 502 గ్రామాల్లో పూర్తయింది. 357 గ్రామాలకు సంబంధించిన ఆర్ధోరిక్టిఫై ఇమేజ్ (ఒఆర్‌ఐ)లు సిద్ధం చేశారు. రీ సర్వే నిర్వహించాల్సిన గ్రామాల్లో 399 విలేజ్ సర్వేయర్లు, 25 మంది మండల సర్వేయర్లు గ్రౌండ్ ట్రూతింగ్, వ్యాలిడిటేషన్ నిర్వహిస్తున్నారు. అభ్యంతరాల పరిశీలనకు డిప్యూటీ తహశీల్దార్లను నియమించారు. మొత్తం ప్రక్రియను తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నారు.
లోపాలు రైతులకు శాపాలు
కార్సు పరిజ్ఞానంతో ఉపగ్రహ అనుసంధానంతో డిఫెన్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (డిజిబిఎస్) ద్వారా
నిర్ణీత భూముల హద్దుల్లో అంగుళం తేడా లేకుండా ఉండేందుకు రీ సర్వేకు రూపకల్పన చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే పలు ప్రాంతాల్లో భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు చోటు చేసుకుంటున్నాయి. రైతుల వద్ద అంగీకార పత్రాలు తీసుకున్న తర్వాత పలువురు రైతులకు సంబంధించిన పాస్ బుక్‌లలో తప్పులు దొర్లాయి. లోపాల సవరణకు వందలమంది రైతులు జిల్లా అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చింది.










