ప్రజాశక్తి ధర్మవరం టౌన్ : మండల పరిధిలోని పోతులనాగేపల్లి లేఅవుట్లో ఇళ్లస్థలాల కోసం భూములిచ్చిన నిర్వాసితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సిపిఎం నాయకులు పోలా రామాంజినేయులు, ఎస్‌హెచ్ బాషా డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ఐదేళ్లక్రితం టీడీపీ హాయంలో భూములిచ్చినప్పటి నుండి రైతులకు ఇంతవరకు పరిహారం అందలేదన్నారు. గతంలో కూడా సీపీఎం ఆధ్వర్యంలో రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని రైతుసంఘాల నాయకులు ఆం దోళన చేశారన్నారు. మార్కెట్ ధరకి డబ్బులు చెల్లించాలని నిబంధనలు ఉన్నప్పటికి ప్రతిపక్షంలో ఉన్న అప్పటి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తమ ప్రభుత్వం వస్తే ఎకరా రూ.20 లక్షలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన వారిచేత కోర్టులో దావా వేయించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే ఇప్పించకపోవడం దారుణమన్నారు. పైగా ప్రస్తుతం కోర్టులో ఉంది ఇప్పుడు అంత మొత్తం ఇవ్వడానికి కాదని ఎమ్మెల్యే పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. వెంటనే భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.25 లక్షలతోపాటు ప్రత్యేకంగా భూమి వసతి కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కలెక్టర్, ఆర్డీఓ, ఇతర అధికారులు వెంటనే రైతులకు న్యాయపరమైన నష్టపరిహారం చెల్లించడానికి కోర్టులో ఉన్న కేసుల్నిపరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆదినారాయణ, ఆయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.










