Nov 06,2020 07:13

     మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం నేడు మన భారత రాజ్యాంగ మౌలిక సూత్రాల పైన దాడిని వివిధ రూపాలలో తీవ్రతరం చేస్తున్నది. పరోక్షంగాను, కొన్ని సందర్భాలలో ప్రత్యక్షంగా కూడా మను ధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం లోకి జొప్పించే యత్నాలను ముమ్మరం చేస్తోంది. నిజానికి భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంటున్న నాటి నుండే దానిపై హిందూత్వ శక్తులు దాడి ప్రారంభించాయి. హిందూ రాజ్య స్థాపనకు భారత లౌకిక రాజ్యాంగం అడ్డం. 1947 ఆగస్టు 15న పాకిస్తాన్‌ ముస్లిం మత రాజ్యంగా ఏర్పడింది. అదే విధంగా భారతదేశం హిందూ మత రాజ్యంగా ఏర్పడాలన్నది వారి కోరిక. కాని రెండు వందల సంవత్సరాల స్వాతంత్య్ర పోరాటం భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండాలన్న లక్ష్యంతో సాగింది. ఈ జాతీయోద్యమం నుండి లౌకికతత్వం, ఫెడరలిజం, సామాజిక న్యాయం వంటి కీలక అంశాలు ముందుకు వచ్చాయి. వీటి ఆధారంగానే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ రూపొందింది.
                                                              రాజ్యాంగం × మనుస్మృతి
          హిందూత్వ సిద్ధాంతానికి ప్రతిరూపమైన ఆర్‌ఎస్‌ఎస్‌ భారత రాజ్యాంగంపై తొలినాటి నుండే విషం కక్కడం ప్రారంభించింది. వారి సిద్ధాంతకర్త వి.డి. సావర్కర్‌ ''భారత రాజ్యాంగంలో భారతీయత అనేది ఏమాత్రం లేకపోవడం అత్యంత నీచమైన విషయం. వేదాల తరువాత మను స్మృతి హిందూ జాతికి అత్యంత పూజనీయమైనది. పురాతన కాలం నుండి మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆలోచనలు, ఆచరణకు మనుస్మృతే భూమిక. ఇది శతాబ్దాల నుండి మన జాతి యొక్క ఆధ్యాత్మిక జీవన గమ్యం. నేటికీ కోటాను కోట్ల హిందువులు మనుస్మృతి నియమాలు పాటిస్తున్నారు. అందువలన మను స్మృతి హిందూ చట్టం (రాజ్యాంగం)'' అని ప్రకటించాడు. 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగం ఆవిష్కరించబడింది. 30వ తేదీనే ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక 'ఆర్గనైజర్‌'లో వచ్చిన సంపాదకీయం చూడండి...''కాని మన రాజ్యాంగంలో పురాతన భారతం లోని తిరుగులేని రాజ్యాంగం పరిణామ ప్రస్తావన లేదు. మను ధర్మ శాస్త్రం అత్యంత పూరాతనమైనది. అందులోని ప్రతి అంశం నేటికీ యావత్‌ ప్రపంచ మన్ననలను అందుకుంటున్నది''. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత ఎం.ఎస్‌.గోల్వాల్కర్‌ ''మన రాజ్యాంగం పాశ్చాత్య దేశాల రాజ్యంగాల నుండి వివిధ అధికరణలను అరువు తెచ్చి భారీగా జాతుల కలగూరగంపగా రూపొందించబడినది. ఇందులో మనది అని చెప్పకోవడానికి ఏమీ లేదు.'' అని ప్రకటించాడు. ఈ విధంగా ఆర్‌ఎస్‌ఎస్‌ దాని కాషాయ దళాలు అవకాశం దొరికినప్పుడల్లా భారత రాజ్యాంగంపై దాడి చేస్తూనే వస్తున్నారు. 1993 జనవరిలో బాబ్రీ మసీదు కూల్చిన మరుసటి నెలలోనే నాటి ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత రాజేంద్ర సింగ్‌ ''భవిష్యత్‌లో మన దేశ నైతిక విలువలు విజ్ఞానానికి సరిపడే రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవాలి'' అని ప్రకటించాడు. అప్పుడే రాజ్యాంగాన్ని హిందూ వ్యతిరేకంగా పేర్కొంటూ ఒక శ్వేత పత్రం విడుదల చేయబడింది. ప్రస్తుత భారత రాజ్యాంగమే అన్ని పాపాలకు కారణం అన్నది శ్వేత పత్రం ఉద్దేశ్యం. దీనికి ముందు మాట రాస్తూ స్వామి హిరణానంద ''ప్రస్తుత రాజ్యాంగం మన దేశం యొక్క సంస్కృతి, స్వభావం, పరిస్థితులకు విరుద్ధమైనది. ఇది విదేశీ అనుకూలమైనది. ఈ రాజ్యాంగం చేస్తున్న నష్టం ముందు వందల సంవత్సరాల బ్రిటీషు పాలన చేసిన నష్టం నామమాత్రం. అంతేకాదు మన నాగరికత, చరిత్ర తెలియని వాళ్లు ఈ రాజ్యాంగాన్ని రాశారు. ఈ రాజ్యాంగాన్ని ఒక చెత్త కుప్ప అనవచ్చు. భారత రాజ్యాంగం మన     ప్రజల ఐక్యతకు, సమైక్యతకు శత్రువు'' అని తేల్చి చెప్పారు. 
           ఇప్పుడు తాజాగా భారత రాజ్యాంగ స్థానంలో మను ధర్మ శాసనాన్ని ప్రతిష్టించాలన్న పన్నాగాన్ని బహిరంగంగానే ముందుకు తెస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పరచిన వారి మేధావుల వేదిక 'సంస్కార భారత్‌' మను ధర్మ శాస్త్రం లోని కొన్ని కఠినమైన పదాలను తొలగించి ప్రజలు ఆమోదించేందుకు వీలుగా మార్చటానికి నిధులు, వగైరా అందించమని కోరుతూ లేఖ రాసింది.
            1923 లోనే వి.డి. సావర్కర్‌ 'హిందూత్వ-ఎవరు హిందువు?' అన్న తన గ్రంథంలో హిందువులు ఒక జాతి, ముస్లింలు ఒక జాతి అని...మతాలను, జాతులను కలగా పులగం చేశాడు. ప్రతి పౌరునికి మాతృ భూమి, పుణ్య భూమి అని రెండుంటాయని, హిందువులకు ఆ రెండూ ఈ దేశమేనని, ముస్లింలు, క్రైస్తవులు ఈ దేశం లోనే పుట్టినా ఒకరికి పుణ్య భూమి మక్కా (సౌదీ అరేబియా), మరొకరికి జెరూసలేం (ఇజ్రాయిల్‌) అని, అందువలన ఆ రెండు మతస్థులు ఈ దేశంలో పూర్తి స్థాయిలో పౌరులు కారని, ఉండదలుచుకుంటే రెండవ జాతి పౌరులుగానే వుండాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతం. వీటన్నింటి ద్వారా వారు నమ్మించదలుచుకున్నది 'భారత్‌ అంటే హిందూ. భారత దేశం అంటే హిందూ దేశం. భారత సంస్కృతి అంటే హిందూ సంస్కృతి. భారత నాగరికత అంటే హిందూ నాగరికత'. ఇలా హిందుత్వ శక్తులు చాలా పకడ్బందీ వ్యూహంతో భారత రాజ్యాంగాన్ని లోలోపల నుండి తొలిచి వేసే కుట్రలు సాగిస్తున్నారు.
            బాబ్రీ మసీదు కూల్చివేయడం, దాని స్థానంలో రామ మందిరాన్ని నిర్మించడం మసీదు విధ్వంసానికి పూనుకున్న వారందరూ నిర్దోషులంటూ న్యాయస్థానం తీర్పు చెప్పడం చూస్తే భారత రాజ్యాంగంపై హిందూత్వ శక్తుల దాడి తారా స్థాయికి చేరిందని గుర్తించాల్సి వుంటుంది. తాజాగా 370వ అధికరణం రద్దు అనేది...స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి హిందూత్వ శక్తుల డిమాండ్‌. రాజ్యాంగం లోని ఒక అధికరణాన్ని నిరంకుశంగా రద్దు చేసి 'ఇప్పుడు జమ్ము, కాశ్మీర్‌ దేశంలో అంతర్భాగం అయ్యాయి' అని బిజెపి ప్రకటిస్తున్నది. అంటే 370వ అధికరణం భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదా అన్న అనుమానం వస్తుంది. దీని కొనసాగింపుగానే పౌరసత్వ సవరణ చట్టాన్ని, జాతీయ పౌరసత్వ పట్టికను రూపొందించటాన్ని, తద్వారా మైనారిటీలపై దాడి చేయటాన్ని మనం చూడాల్సి వుంటుంది. అలాగే హిందూ సమాజం లోని అసమానతలపై ముఖ్యంగా అణగారిన సామాజిక తరగతులను అభివృద్ధి చేయటానికి రూపొందించబడిన దళితులు, గిరిజనులపై అత్యాచార నిరోధక చట్టాన్ని, దళితులు, వెనుకబడిన తరగతుల కోసం చేయబడ్డ అసైన్డ్‌ భూముల విక్రయ నిషేధ చట్టాన్ని, చివరికు రిజర్వేషన్లు కూడా రద్దు చేయటానికి ఈ మధ్య హిందూత్వ శక్తులు చేస్తున్న ప్రయత్నాలు మన చూస్తున్నాం. ఇవన్నీ అంతిమంగా రాజ్యాంగ స్ఫూర్తిని తుద ముట్టించేవే. తాజాగా రాష్ట్ర జాబితాలో వున్న వ్యవసాయంపై కేంద్ర బిజెపి సర్కార్‌ అడ్డగోలుగా తెచ్చిన చట్టాలు...ఉమ్మడి జాబితాలో వున్న విద్య, విద్యుత్‌ వంటి రంగాలలో నిరంకుశంగా చొరబడి చేస్తున్న చట్టాలు...రాష్ట్రాల హక్కులను ఒకదాని తరువాత ఒకటి కాలరాస్తూ భారత రాజ్యాంగ ఫెడరల్‌ స్వభావాన్ని అంతం చేస్తున్న ప్రయత్నాలను చూస్తే ఒక విషయం స్పష్టమౌతుంది. స్వాతంత్య్రోద్యమం ముందుకు తెచ్చిన ఉన్నత విలువలకు చెల్లు చీటీ ఇచ్చి రాజ్యాన్ని మను ధర్మ శాస్త్రం ఆధారంగా నడిపించే దేశంగా మార్చనున్నారు.
          రాజ్యాంగ నిర్మాత డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ముందు ప్రవేశ పెడుతూ ''రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దాన్ని అమలు చేసే పాలకులు మంచి వారు కాకపోతే ఆ రాజ్యాంగం చెడ్డదిగా నిరూపించబడుతుంది...నేటి నుండి మనం వైరుధ్య భరిత జీవితం లోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాలలో సమానత్వం పొందినా సామాజిక, ఆర్థిక హక్కుల విషయంలో సమానత్వం రాలేదు. ఈ వైరుధ్యాన్ని ఎంతకాలం కొనసాగించాలి. సామాజిక, ఆర్థిక జీవితాల్లో సమానత్వాన్ని ఎంత కాలం తిరస్కరించాలి. మనం ఎంత కాలం తిరస్కరిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యం అంత ప్రమాదంలో పడిపోతుంది. అందువలన ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. లేకుంటే అసమానతలతో బాధపడేవారు...ఈ రాజ్యాంగ అసెంబ్లీ చాలా శ్రమతో నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని కూల్చేస్తార''ని హెచ్చరించారు.
         ఆ హెచ్చరిక నేడు వాస్తవ రూపం ధరించి ప్రమాదం నడినెత్తిన పొంచి వుంది. ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తులన్నీ ఈ దాడిని తిప్పికొట్టి లౌకికతత్వం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, భిన్నత్వంలో ఏకత్వం వంటి రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవాలి.

(వ్యాసకర్త ఎ.పి సిపిఐ(ఎం) కృష్ణా జిల్లా
తూర్పు కమిటీ కార్యదర్శి)

ఆర్‌. రఘు