Jan 02,2023 21:42

ఫొటో : ఆర్‌డిఒ వి.కె.శీనా నాయక్‌కు వినతి పత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

బ్రిడ్జీ నిర్మాణ పనులు ప్రారంభించాలి
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలో ప్రధానమైన పెద్దపవని బస్టాండు ఓవర్‌ బ్రిడ్జి పనులను ప్రారంభించాలని సిపిఎం నాయకులు సోమవారం ఆర్‌డిఒ వి.కె.శీనానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రధానమైన పెద్దపవని బస్టాండుకు వచ్చే రోడ్డులో పట్టణ నడిబొడ్డున రైల్వే లైను ఉన్నందున అక్కడ రైల్వే గేట్‌ వల్ల గంటల తరబడి ట్రాఫిక్‌ ఆగిపోయి ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో ప్రజలు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న అప్పటి ప్రభుత్వం కావలి మాజీ ఎంఎల్‌ఎ మాగుంట పార్వతమ్మ బ్రిడ్జి నిర్మాణానికి 2009 సంవత్సరంలో శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రైల్వే పరిధిలో ఉన్న బ్రిడ్జీ నిర్మాణం పూర్తయి, ఇప్పటికీ సుమారు 14 సంవత్సరాలు అవుతున్నప్పటికీ బ్రిడ్జీ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదన్నారు.
ప్రభుత్వాలు మారిన బ్రిడ్జి పూర్తి కాలేదని ప్రజల ఇబ్బందులు తీరలేదని దీనివల్ల ముఖ్యంగా పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గ్రామాల నుండి పట్టణానికి వచ్చిపోయే ప్రయాణికులు సంవత్సరాలు తరబడి రాకపోకలకు పలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవట్లేదని వాగ్దానాలకే పరిమితం అయినారని, రైల్వే పరిధిలో ఉన్న బ్రిడ్జీ పూర్తయినప్పటికీ మిగతా పనుల ఊసేలేకపోవడం విచారకరమైన విషయమన్నారు. బ్రిడ్జీ నిర్మాణ పనులలో అధికారులు, ప్రజా ప్రతినిధులు విఫలమవుతున్నారన్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే బ్రిడ్జీ పనులను ప్రారంభించాలని సిపిఎం తరఫున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. దీనిపై దశల వారీ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు వై.క్రిష్ణ మోహన్‌, జి.మధుసూదనరావు, పి.పెంచలనరసింహం, సిపిఎం నాయకులు బి.కృష్ణయ్య, వి.బాబురావు, పి.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.