Nov 19,2020 06:37

బిజెపి నాయకత్వం లోని ఎన్‌డిఎ ప్రభుత్వం...ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల లోని ప్రభుత్వ వాటాలను అమ్మివేసేందుకుగాను 'నీతి ఆయోగ్‌' పలు ప్రణాళికలు సిద్ధం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.2,10,000 కోట్ల మేరకు నిధుల్ని సమీకరిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గత బడ్జెట్‌లో ప్రకటించారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం దీనిలో భాగమే. ప్రభుత్వ వాటాలను సైతం 51 శాతానికి తగ్గించేశారు. ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లును ముందుకు తేవడం ద్వారా రుణాల ఎగవేతదార్లను కాపాడే ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనక్కు తగ్గింది. మరో రూపంలో ఇటువంటి బిల్లును తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది.

ప్రభుత్వ రంగ సంస్థలు దేశ ప్రజల ఆస్తులు. వీటిలో కీలకమైంది భారతీయ రైల్వేలు. అటువంటిది...త్వరలో ప్రైవేటు రైళ్ళను పట్టాలెక్కించనున్నారు. 'ప్రజల సొమ్ము-ప్రజా సంక్షేమానికే'' లక్ష్యంతో పని చేస్తున్న ఎల్‌ఐసి పైనా ప్రభుత్వ దృష్టి పడింది. ఎల్‌ఐసి లోని ప్రభుత్వ వాటాలను ఉపసంహరించి స్టాక్‌ మార్కెట్‌కు తరలిస్తారట. రోడ్లు, రైల్వేలు, హౌసింగ్‌, విద్యుత్‌, ఇరిగేషన్‌ వంటి కీలక రంగాలకు నిధులందించే బీమా సంస్థ ఎల్‌ఐసి ని ప్రైవేటీకరిస్తే దేశ ప్రగతికి పెద్ద ఆటంకం కదా!

విదేశీ కంపెనీలను అనుమతిస్తే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు దేశం లోకి తరలివస్తాయని సరళీకరణ అనుకూలవాదులు చేసిన ప్రచారం వాస్తవం కాదని ఇప్పటికే తేలిపోయింది. కానీ రిటైల్‌ వర్తకం, రక్షణ, టెలికాం, పౌర విమానయానం వంటి రంగాలలో విదేశీ పెట్టుబడులను అనుమతించారు. బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎయిర్‌ ఇండియా వంటి బలమైన ప్రభుత్వ రంగ సంస్థలు త్వరితగతిన మార్కెట్‌ వాటాను కోల్పోయి నేడు తమ ఉనికిని కాపాడుకునే పరిస్థితుల్లోకి నెట్టబడ్డాయంటే ప్రభుత్వాలు అనుసరించిన విధానాల లోపమే కదా! నవరత్న మహారత్నాలుగా పేరొందిన ఓఎన్‌జిసి, ఎన్‌టిపిసి, కోల్‌ ఇండియా లిమిటెడ్‌ వంటి పలు సంస్థలలో ప్రభుత్వ వాటాలను అమ్మివేశారు. ప్రభుత్వ రంగం లోని సాధారణ బీమా సంస్థలను, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా వంటి సంస్థలను ప్రైవేటీకరించాలని, దేశంలోని విశ్వ విద్యాలయాలకు తలమానికంగా ఉన్న యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) ను రద్దు చేయాలని కూడ ప్రభుత్వం నిర్ణయించింది. చివరకు ఢిల్లీ లోని ఎర్రకోట నిర్వహణను కూడా దాల్మియా గ్రూప్‌కు అప్పజెప్పేశారు.

అత్యంత ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయాలనుకోవడం బంగారు గుడ్లు పెట్టే బాతుల పీక నులిమివేయడమే. బొగ్గు, బాక్సైట్‌, ఇనుప ఖనిజం, గ్యాస్‌ వంటి ప్రకృతి వనరులను బడా పెట్టుబడిదారుల హస్తగతం చేస్తే ఆర్థిక స్వావలంబనకు అర్థం ఏముంటుంది? బ్రిటిష్‌ పాలకుల నుండి స్వాతంత్య్రం కోసం ఎందుకు పోరాడాం? కోట్లాది మంది ప్రజల ప్రయోజనాల కోసమా? లేక అంబానీ, అదానీల వంటి కొద్ది మంది కోసమా? ప్రభుత్వ రంగ పాత్రను కుదించేందుకుగాను ప్రణాళికా సంఘాన్ని కూడ రద్దు చేశారు. ప్రజా సంక్షేమం కంటే కార్పొరేట్ల శ్రేయస్సే తమ సిద్ధాంతమని స్పష్టంగా తేల్చేశారు.

ప్రజల పొదుపు మొత్తాల పైన, మన ఆర్థిక వనరుల పైన విదేశీ కంపెనీలతో పాటు దేశీయ బడా కార్పొరేట్లు ఆధిపత్యం వహిస్తే మన ఆర్థిక స్వావలంబన ప్రమాదంలో పడుతుంది. మానవాభివృద్ధి నివేదిక, ఆకలి సూచితో సహా ఏ నివేదిక చూసినా ప్రపంచ దేశాలలో భారత్‌ ఎందుకు వెనుకబడిందో, మెజారిటీ ప్రజలకు అభివృద్ధి ఫలాలను అందించడంలో ప్రభుత్వాలు ఎందుకు విఫలమయ్యాయో ప్రజానీకం, మేధావులు నిశితంగా విశ్లేషించాలి. కేవలం ఒక్క శాతంగా ఉన్న బడా సంపన్నుల ప్రయోజనాలే ధ్యేయంగా విధానాల రూపకల్పన ఎందుకు జరుగుతోంది? ఉపాధి అవకాశాలతో పాటు కొనుగోలు శక్తి పెరిగితేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒత్తిళ్ళకు తలొగ్గి, సరళీకరణను వేగవంతం చేసి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తే అది ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు అశనిపాతమే.

దేశ సమగ్రాభివృద్ధికి, ఆర్థిక సుస్థిరతకు బలమైన ప్రభుత్వ రంగమే ముఖ్యమైన సాధనం. 'సబ్‌ కా సాత్‌ - సబ్‌ కా వికాస్‌, ఆత్మ నిర్భర్‌ భారత్‌' వంటి నినాదాలు సాకారం కావాలంటే ప్రత్యామ్నాయ, ప్రజానుకూల ఆర్థిక విధానాలు అమలు చేయాలి. లేని పక్షంలో అవి కేవలం ఒట్టి నినాదాలుగానే మిగిలిపోతాయి. నవంబర్‌ 26వ తేదీన అనేక ప్రభుత్వ రంగాల ఉద్యోగులు తలపెట్టిన జాతీయ సమ్మె 'నూతన భారత్‌' నిర్మాణానికై జరిగే పోరాటంలో భాగమే. ప్రభుత్వ రంగ పరిరక్షణకు జరుగుతున్న ప్రచారాందోళనలో ముఖ్య భాగమే. ఈ సమ్మెకు దేశ ప్రజల మద్దతు, సహకారం అవసరం.
                  - వి.వి.కె. సురేష్‌ (ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ డివిజినల్‌ సంయుక్త కార్యదర్శి, మచిలీపట్నం డివిజన్‌, సెల్‌ : 94403 45850)