Jan 02,2023 21:17

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న రైతు సంఘాల నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న రైతు సంఘాల నాయకులు
బ్లాక్‌మార్కెట్‌లో యూరియా అమ్మకాన్ని అడ్డుకోవాలి
-ఎపి రైతు , కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్‌
ప్రజాశక్తి-నెల్లూరు:బ్లాక్‌ మార్కెట్‌లో యూరియా అమ్మకాన్ని అధికారులు అడ్డుకొని, జిల్లాలో వరిపంట సాగుబడి చేస్తున్న రైతాంగానికి సరిపడా ఆర్‌బికె కేంద్రాలు, సొసైటీల ద్వారా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎపి రైతు , కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. సోమవారం జిల్లాలో నెలకొన్న యూరియా కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎపి రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టాయి. ఈ సందర్భంగా ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పులిగండ్ల శ్రీరాములు, పొట్టేపాళెం చంద్రమౌళిలు మాట్లాడుతూ జిల్లాలో 6 నుంచి 7 లక్షల ఎకరాల్లో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు వరి సాగుబడి చేస్తున్నారన్నారు.
వీరందరికీ యూరియా ఎంతో అవసరమని పేర్కొన్నారు. జిల్లాలోని ఎక్కువ మండలాల్లో వరి సాగుబడి చేస్తున్న రైతులకు యూరియా అందుబాటులో లేదన్నారు. వాస్తవానికి మార్కెట్‌ ధరకు అదనంగా మరో రూ.70లు కలిపి బ్లాక్‌ మార్కెట్‌లో యూరియా బస్తాప్రయివేట్‌ వ్యక్తులు విక్రయిస్తున్నారన్నారు. ప్రభుత్వం మాత్రం రైతు భరోసా కేంద్రాల ద్వారా, సొసైటీల ద్వారా రైతాంగానికి అవసరమైనత మేరకు యూరియా సరఫరా చేస్తామని ప్రకటించిందన్నారు. ప్రభుత్వం చేసిన ప్రకటనలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అయ్యాయని, రైతాంగానికి అవసరమైనంత యూరియా జిల్లాలోని ఆర్‌బికె కేంద్రాల్లో ఎక్కడా అందజేయడం లేదన్నారు.కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తుళ్లూరు గోపాల్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. పుల్లయ్యలు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో రబీ సీజన్‌ ప్రారంభమైన తరువాత జిల్లాలో ఆలస్యంగా రబీ సీజన్‌ ప్రారంభం అవుతుంచ దన్నారు.తక్షణమే ఆర్‌బికె కేంద్రాల్లో, సొసైటీ సంఘాల్లో యూరియా అమ్మకాలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలె వెంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు పి.రమేష్‌, ఓడూరు వెంకట కృష్ణయ్య, జి.బుజ్జయ్య, గురునాధం పలువురు రైతు సంఘాల నాయకులు ప్రసంగించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతుసోదరులు పాల్గొన్నారు.