Sep 26,2020 17:59

న్యూఢిల్లీ : బిజెపి జాతీయ నూతన కార్యవర్గాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ప్రకటించారు. నూతన కార్యవర్గంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన డికె అరుణ, పురందేశ్వరికి చోటు దక్కింది. తెలంగాణకు చెందిన డికె అరుణను జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పురందేశ్వరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడుగా నడ్డా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ను ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియమితులు కాగా, ఎపికి చెందిన సత్యకుమార్‌ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగుతున్నారు. మొత్తం 12 మంది జాతీయ ఉపాధ్యక్షులుగా, 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 13 మంది జాతీయ కార్యదర్శులుగా, ముగ్గురు జాయింట్‌ సెక్రటరీలుగా నియమితులయ్యారు. జాతీయ అధికార ప్రతినిధులుగా 23 మందికి అవకాశం కల్పించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు చోటుచేసుకోవడం విశేషం. గతంలో ప్రధాన కార్యదర్శులుగా ఉన్న రామ్‌ మాధవ్‌, మురళీధర్‌ రావును బాధ్యతల నుంచి తప్పించారు. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న జివిఎల్‌ నర్సింహారావునూ ప్రతినిధుల జాబితా నుంచి తప్పించారు.