పూర్వ సోవియట్ యూనియన్‌లో భాగమైన బెలారస్ (బైలో రష్యా)ను అస్థిరపరిచేందుకు అమెరికా, యూరపు దేశాలు చేస్తున్న కుట్రలు గర్హనీయం. ఆగస్టు 9న జరిగిన ఎన్నికల్లో అలెగ్జాండర్ లుకషెంకో తిరిగి ఆరవసారి అధక్షుడిగా ఎన్నిక కావడాన్ని పశ్చిమ దేశాలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. లుకషెంకో ఎన్నిక అక్రమమంటూ నానా యాగీ చేస్తున్నాయి. బెలారస్ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందంటూ పశ్చిమ దేశాలు, వాటి అధీనంలోని మీడియా బాకాలు, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా సాధనాలు పెద్దయెత్తున దుష్ప్రచారం సాగించాయి. కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష పార్టీలు బలపరిచిన లుకషెంకో ఈ ఎన్నికల్లో 80 శాతం ఓట్లు సాధించగా, ఆయన ప్రత్యర్థి లిథువేనియాకు ప్రవాసం వెళ్లిన స్వెత్లానాకు కేవలం 10 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. స్వెత్లానా రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఆమె భర్త అలెక్సీ నవల్నీ పచ్చి వదరుబోతు. ఒక కేసులో శిక్షపడి పోటీకి అనర్హుడు కావడంతో ఆయన స్థానంలో స్వెత్లానా పోటీ చేశారు. కమ్యూనిస్టులు, వామపక్ష పార్టీల మద్దతు తెలపడంతో ఈ ఎన్నికల్లో లుకషెంకోను ఓడించాలన్న పశ్చిమ దేశాల యత్నాలు బెడిసికొట్టాయి. లుకషెంకో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటువంటి దుష్ప్రచారం సాగించడం అమెరికా, యూరోపియన్ దేశాలకు కొత్తేమీ కాదు. గత మూడు దశాబ్దాలుగా ఎన్నికలు జరిగిన ప్రతిసారి పశ్బిమ దేశాలు ఇదే పాట పాడుతున్నాయి. ఉక్రెయిన్‌లో మాదిరిగా బెలారస్ లోనూ హింసను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలదోసి, తన తొత్తులను గద్దెనెక్కించాలని చూస్తున్నాయి. అవన్నీ బెడిసికొట్టడంతో వెనిజులాలో ఆడిన నాటకాన్నే, బెలారస్‌లో పునరావృతం చేయాలని చూస్తున్నాయి. లుకషెంకో ఎన్నికను తాము గుర్తించడం లేదని, ప్రవాసంలో ఉన్న స్వెత్లానాను బెలారస్ అధ్యక్షురాలిగా గుర్తిస్తున్నామని ప్రకటించాయి. ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలను విధించాయి. బెలారస్‌లో వనరులను కొల్లగొట్టుకుపోయేందుకు, ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ రంగానికి గల తిరుగులేని అజమాయిషీని దెబ్బ తీయాలన్న పశ్చిమ దేశాల కుట్రలను లుకషెంకో ప్రభుత్వం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. నయా ఉదారవాద విధానాలకు భిన్నమైన ఆర్థిక పంథాను లుకషెంకో అమలు చేయడమే గాక అమెరికా ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా వెనిజులా, రష్యా, ఇరాన్, చైనా వంటి దేశాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. బెలారస్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టింది. అందరికీ విద్య, వైద్యం అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. చైనా సిల్క్ రోడ్డు యూరప్ దేశాలతో అనుసంధానంలో బెలారస్ కీలక పాత్ర పోషిస్తున్నది. రష్యాను దెబ్బతీయడం ద్వారా ఈ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్న అమెరికాకు లుకషెంకో కొరకరాని కొయ్యలా మారారు. లిథువేనియా, ఉక్రెయిన్, జార్జియా, అజర్‌బైజాన్, పోలండ్, చెక్ రిపబ్లిక్‌లలో మితవాద ప్రభుత్వాల అండతో బెలారస్‌లో అంతర్యుద్ధ పరిస్థితిని సృష్టించాలని అమెరికా, ఇ.యు ప్రయత్నిస్తున్నాయి. బెలారస్‌లో ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే లుకషెంకోను నియంత అని నిందిస్తున్నాయి. మానవ హక్కుల గురించి అమెరికా మాట్లాడడమంటే దెయ్యాలు వేదాలు వల్లించిన చందమే. స్వదేశంలో నల్లజాతీయులను కాల్చి చంపిన శ్వేతజాతి దురహంకార అధికారులను బాహాటంగా వెనకేసుకొస్తున్న చరిత్ర అమెరికాది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడం, మానవ హక్కులను హరించడంలో ఘనత వహించిన పశ్చిమ దేశాలు బెలారస్‌లో మానవ హక్కుల గురించి మాట్లాడడం హాస్యాస్పదం. బెలారస్ అంతర్గత వ్యవహారాల్లో బయటి శక్తులు తల దూర్చడాన్ని ఎంతమాత్రం అనుమతించరాదు. బెలారస్‌కు వ్యతిరేకంగా అమెరికా, ఇ.యు విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవాలి. అదే సమయంలో బయటి జోక్యానికి ఆస్కారం లేకుండా లుకషెంకో ప్రభుత్వం శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు యత్నించాల్సిన అవసరముంది.










