6 న రహదారుల దిగ్బంధం : సంయుక్త కిసాన్ మోర్చా
ఈ నెల 6 న దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధానికి సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. సోమవారం సింఘూ సరిహద్దుల్లో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు సంఘాల నేతలు ఈ విషయాన్ని ప్రకటించారు. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు తగ్గించారని రైతు నేతలు విమర్శించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చారు.
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న రైతులపై కేంద్రం కక్షసాధింపులకు దిగు తోంది. ప్రతిరోజూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి రైతులు వందలాది ట్రాక్టర్లతో వేలాది మంది ఢిల్లీ-హర్యా నా సరిహద్దు ప్రాంతాలు సింఘూ, టిక్రీ, ఢిల్లీ-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ఘాజీపూర్, హర్యానా-రాజస్థాన్ సరిహద్దు షాజహాన్‌పూర్ వద్ద ఆందోళనల్లో చేరుతున్నారు. ఘాజీ పూర్ సరిహద్దుకు వందలాదిమంది చిన్నారులు, మహిళ లు, వృద్ధులు కాలినడకన చేరుకుంటున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ జిల్లాల నుంచి దేశ రాజధానికి రైతులు కదంతొక్కారు. ఇప్పటికే రైతుల ఉద్యమంలో 68వ రోజుకు చేరుకుంది. ఇప్పటికే దాదాపు 180 మంది రైతులు మరణించారు.
సింఘూ వద్ద తాత్కాలిక గోడ
రైతులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు కొనసాగిస్తూ, మరింత అమానవీయంగా వ్యవహరిస్తోంది. భారీ సంఖ్యలో రైతులు ఆందోళన చేస్తున్న ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతం సింఘూ వద్ద ప్రభుత్వం తాత్కాలిక గోడను నిర్మిస్తుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా రైతు నేతలు స్పష్టం చేస్తున్నారు.
250 ట్విట్టర్ ఖాతాలు బ్లాక్
రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చిన వారితోపాటు మరికొంత మంది ట్విట్టర్ ఎకౌంట్లు బ్లాక్ అయ్యాయి. దేశవ్యాప్తంగా దాదాపు 250 అకౌంట్లను సోమవారం ట్విట్టర్ సంస్థ బ్లాక్ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న పలువురి ట్విట్టర్ ఖాతాలపై చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. అందులో భాగంగానే ట్విట్టర్ తాజా నిర్ణయం తీసుకుందని తెలిపింది. ప్రసార భారతి సిఇఒ శశిశేఖర్ వెంపతి, కారవాన్ మ్యాగజైన్, సిపిఎం మాజీ ఎంపి ఎమ్‌డి సలీం, కిసాన్ మోర్చాతోపాటు పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలను మూసివేస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటన విడుదల చేసింది. ''భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడటానికి పారదర్శకత చాలా ముఖ్యమైనది. కంటెంట్‌ను నిలిపివేయాలని అభ్యర్థనలు అందిన అనంతరం ప్రభావిత ఖాతాదారులకు సమాచారాన్ని వెంటనే తెలియజేస్తాం'' అని ట్విటర్ ఆ ప్రకటనలో తెలిపింది. ఃచవీశీసఱూశ్రీaఅఅఱఅస్త్ర ఖీaతీఎవతీ+వఅశీషఱసవ హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తున్న దాదాపు 250 ట్వీట్లు / ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.. ట్విట్టర్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇది ఒక రకమైన సెన్సార్‌షిప్ : ఎమ్‌డి సలీం, సిపిఎం మాజీ ఎంపి
తన ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయడంపై సిపిఎం మాజీ ఎంపి ఎమ్‌డి సలీం ఖండించారు. ''ఒక ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడినప్పుడు దాని వెనుక కారణం ఉన్నప్పుడు ట్విట్టర్ తక్షణమే తెలియజేస్తుంది. రెండు గంటల తర్వాత నాకు ఇమెయిల్ వచ్చింది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. కొన్ని ప్రభుత్వ విభాగాల ఆదేశాలను ఉటంకిస్తూ అనేక ట్విట్టర్ ఖాతాలు నిలిపివేయబడ్డాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి ఎవరు అనుకూలంగా మాట్లాడుతున్నారో, వారి ట్విట్టర్ ఖాతాలను నిలిపివేశారు. ఇది ఒక రకమైన సెన్సార్‌షిప్'' అని సలీం విమర్శించారు.
కొనసాగుతున్న ఇంటర్నెట్ నిలిపివేత
ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల్లో ఇంటర్నెట్ నిలిపివేత కొనసాగుతోంది. మూడు సరిహద్దు ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేత మంగళవారం రాత్రి వరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. సింఘూ, ఘాజిపూర్, టిక్రీ సరిహద్దుల్లోని రైతు నిరసన ప్రదేశాలలో ఇంటర్నెట్ సేవల తాత్కాలిక నిలిపివేతను మంగళవారం రాత్రి వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. మూడు సరిహద్దు ప్రాంతాలే కాకుండా, వాటి పక్కనే ఉన్న ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఈ నిలిపివేత జనవరి 31 రాత్రి 11 నుంచి ఫిబ్రవరి 2 రాత్రి 11 వరకు అమలులో ఉంటుంది.
రైతులను విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
అక్రమంగా అరెస్టు చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైుంది. సింఘూ, టిక్రీ, ఘాజీపూర్ సరిహద్దులు, చుట్టు పక్కల ఉన్న రైతులను జనవరి 26న, ఆ తరువాత అక్రమంగా అరెస్టు చేశారు. చట్టవిరుద్ధంగా నిర్బంధించిన రైతులతోసహా, జర్నలిస్టులను విడుదల చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.










