Nov 08,2023 21:41

ఇటీవల బొబ్బిలి సమీపంలో బోల్తాపడిన ఆర్‌టిసి బస్సు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  ఎపిఎస్‌ ఆర్‌టిసిలో గడిచిన రెండు దశాబ్థాలుగా అనుసరించిన ప్రైవేటీకరణ విధానాల ప్రభావం ప్రస్తుతం దుష్ప్రభావాలు చూపుతున్నాయి. బస్సులు ఎక్కడికక్కడ మొరాయిస్తుండడంతోపాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందుకు బస్సు డ్రైవర్లను, సూపర్‌ వైజర్లను బాధ్యులుగా చేసి, చేతులు దులుపు కుంటున్నారు. మరోవైపు ఆర్‌టిసిలో ఏటా ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేయడం లేదు. ఔట్‌ సోర్సింగ్‌, ఎన్‌ఎంఆర్‌ సిబ్బందితో కాలక్షేపం చేస్తున్నారు. వారికి పనిభద్రత కూడా కొరవడుతోంది. రెండు రోజుల క్రితం విజయవాడ బస్టాండ్‌, అనంతరం పురం కలెక్టరేట్‌ వద్ద ఆర్‌టిసి బస్సులు దూసుకుపోయి పలువురు మృతి చెందిన నేపథ్యంలో ఆర్‌టిసి బస్సుల ఫిట్‌నెస్‌పై చర్చ జరుగుతోంది.
విజయనగరం ఆర్‌టిసి రీజియన్‌ పరిధిలో విజయనగరం, ఎస్‌.కోట డిపోలు ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో పార్వతీపురం, పాలకొండ, సాలూరు డిపోలు ఉన్నాయి. విజయనగరం ఆర్‌టిసి డిపో పరిధిలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, ఆల్ట్రాడీలక్స్‌, డీలక్స్‌ బస్సు సర్వీసులన్నీ కలిపి 144 మాత్రమే ఉన్నాయి. ఎస్‌.కోట డిపో పరిధిలో 46 బస్సులు మాత్రమే ఉన్నాయి. మన్యం జిల్లాలో ఆర్‌టిసి బస్సులు 236, అద్దె బస్సులు 75ఉన్నాయి.
విశ్వనీయ సమాచారం మేరకు విజయనగరం డిపో పరిధిలోని 80 నుంచి 100 బస్సుల వరకు రోజువారీ మెయింటెనెన్స్‌ కోసం గ్యారేజీకి వెళ్తున్నాయి. గేర్‌ రాడ్స్‌, క్లెచ్‌ప్లేట్స్‌, యాక్సలేటర్స్‌, బస్సుకు అత్యంత కీలకమైన పిపి సాఫ్ట్‌ (ఇరుసు) మరమ్మతులు తరచూ చేయాల్సి వస్తోంది. కానీ, వీటిని బాగుచేయడానికి అవసరమైన హార్డ్‌వేర్‌ సామగ్రి (విడి పరికరాలు) స్థానిక స్టోర్‌ రూంలో అందుబాటులో ఉండడం లేదని గ్యారేజీలో పనిచేస్తున్న సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో, అప్పటికప్పుడు అతుకుల బొంత మాదిరిగా తాత్కాలిక మరమ్మతులు చేపట్టాల్సిన దుస్థితి దాపురిస్తోంది. చాలా బస్సులకు డ్యాష్‌ బోర్డు, అందులో భాగంగావున్న స్పీడో మీటర్లు కూడా పనిచేయడం లేదని ఆర్టీసి డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ బస్సులకు ఆయిల్‌ సీల్స్‌ పగిలిపోవడం వంటివి కూడా తరచూ జరుగుతున్నాయి. దీనివల్ల ఇంజిన్‌ ఆయిల్‌, పవర్‌ ఆయిల్‌ శరవేగంగా తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఇంజిన్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. స్టీరింగ్‌, గేర్లు కూడా బిగుసుగుపోవడంతో డ్రైవింగ్‌ సవాలుగా మారుతుంది. వీటి కారణంగా మార్గ మధ్యలోనే బస్సులు ఆగిపోతున్నాయి. కొన్నిసార్లు బస్సు వేగంగా నడుస్తున్నప్పుడు బ్రేకులు పనిచేయకపోవడం, క్లైచ్‌ ప్లేట్లు పూర్తిగా పనిచేయకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు కూడా సంభివిస్తున్నాయి. ఇటువంటి సాంకేతిక లోపం వల్లే ఇటీవల విజయవాడ, అనంతపురాల్లో ప్రమాదాలు సంభవించాయి.
మరోవైపు రీజియన్‌ పరిధిలో తగినంత సిబ్బంది లేరు. 160 బస్సులకు గాను 56మంది డ్రైవర్లు రోజువారీ కూలికి పనిచేస్తున్నారు. రెగ్యులర్‌ డ్రైవర్లు కూడా పరిమితంగా ఉండడంతో మొత్తం అందరి డ్రైవర్లపైనా పనిభారం, ఒత్తిడి పెరుగుతోంది. దీనికితోడు బస్సుల్లో డ్రైవర్‌కు తగిన సీటు ఉండడం లేదు. ముందు, వెనుక నుంచి వస్తున్న వాహనాలను తెలుసుకునేందుకు ఉపయోగించే అద్దాలు కూడా నాసిరకం వాడడంతో డ్రైవర్లు కొన్ని సందర్భాల్లో గందరగోళానికి గురికావాల్సిన దుస్థితి దాపురిస్తోంది. ఈ పనులు చేయాల్సిన కోచ్‌బిల్డర్‌ గ్యారేజి మొత్తానికి ఒకే ఒక్కడు ఉన్నాడు. అది కూడా ఔట్‌ సోర్సింగ్‌ కావడంతో రూ.12వేల వేతనానికి పనిచేస్తున్నాడు. ఇతను రోజుకు రెండు లేదా మూడు బస్సులకు మించి అద్దాలు అమర్చడం, సీట్లు సరిచేయడం వంటి పనులు చేస్తున్నాడు. దీంతో, మిగిలిన బస్సులన్నీ వీటిని సరిచేయకుండానే నడిపేస్తున్నారు. ఈ విషయంలో మెకానిక్‌ మొదలుకుని డిపో, రీజియన్‌ స్థాయి అధికారులకు తెలిసినా ఉన్నతాధికారులకు లేదా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లేంత స్వేచ్ఛ కూడా లేకపోతోంది. ప్రభుత్వం తనకు పట్టనట్టుగా వ్యవహరించడంతో ఆర్‌టిసి బస్సుల ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. పండగలు పబ్బాలకు కూడా ఆర్‌టిసి మూలకు చేరిన బస్సులనే ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయి. విజయనగరం డిపో పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు తొమ్మిది ప్రమాదాలు జరగ్గా నలుగురు వ్యక్తులు మృతి చెందారని, మరికొందరు గాయపడ్డారని ఆర్‌టిసి అధికారులే చెబుతున్నారు.