.ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ అధికార బిజెపిలో సాధారణ సభ్యురాలేమీ కాదు. ఆమె మధ్యప్రదేశ్ నుండి పార్లమెంటుకు ఎన్నికైన సభ్యురాలు. రక్షణ కమిటీలో కూడా సభ్యురాలుగా వున్నారు. నాథూరాం గాడ్సేను ప్రశంసిస్తూ ప్రకటన ఇచ్చినప్పుడు ఆమెను కమిటీ నుండి తొలగించారు. మాలెగావ్ పేలుళ్లలో ఆరుగురు చనిపోయినప్పుడు ఆమె ప్రప్రథమంగా వెలుగు లోకి వచ్చారు.
26.11.2008న హత్యకు గురైన హేమంత్ కర్కరే మాలెగావ్ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు ఒక కీలకమైన అంశాన్ని గుర్తించారు. మాలెగావ్ పేలుళ్ళలో ఉపయోగించిన మోటార్ సైకిల్ గతంలో ఠాకూర్‌కు చెందినదనే వాస్తవాన్ని వెలికి తీశారు. ఈ దర్యాప్తు ఆమె అరెస్టుకు దారితీయడమే కాక, ఆ కుట్రలో భాగస్వాములైన అనేక మంది అరెస్టు అయ్యారు. ఆమె ప్రస్తుతం వైద్య కారణాల రీత్యా బెయిలుపై వున్నారు.
కర్కరే తనను వేధించాడనీ, తన శాపం వల్లనే అతను ప్రాణాలు పోగొట్టుకున్నాడనీ ప్రకటన చేసి ఆమె ప్రాచుర్యం లోకి వచ్చారు. అధిష్టానం నుండి వచ్చిన ఒత్తిడితో ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. దీని తరువాత నాథూరామ్ గాడ్సేని జాతీయవాదిగా పేర్కొంటూ మరొక ప్రకటన చేశారు. ఆయన గతంలో జాతీయవాదేనని, భవిష్యత్తులో కూడా జాతీయవాదిగానే వుంటారని ప్రకటించారు. మరొకసారి ఈ ప్రకటనను కూడా వెనక్కు తీసుకోవాలని ఆమెపై ఒత్తిడి వచ్చింది. తాను కూడా ఠాకూర్‌ను క్షమించలేనని మోడీ తెలిపారు.
ఆమె వ్యాఖ్యానాల పరంపరలో భాగంగా తాజాగా వర్ణ వ్యవస్థపై మరొక వ్యాఖ్య చేశారు. డిసెంబర్ 13న, శూద్రులను గురించి వ్యాఖ్యానిస్తూ, సామాజిక పొందిక పట్ల అజ్ఞానంతో, శూద్రులను శూద్రులని పిలిస్తే వారు అవమానంగా భావిస్తారని తెల్పింది. ఠాకూర్ క్షత్రియ మహాసభలో ప్రసంగిస్తూ, మన ప్రాచీన గ్రంథాలను పరిశీలించినట్లయితే మన సమాజం నాలుగు విభాగాలుగా విభజింపబడిందని, ఈ పద్ధతి లోనే నేటి క్షత్రియులు వారి విధులను అర్ధం చేసుకొని, అధిక సంఖ్యలో పిల్లలకు జన్మనిచ్చి సైన్యం లోకి పంపించవలసిన అవసరముందని చెప్పారు. అప్పుడు మాత్రమే వారు దేశం కోసం పోరాడుతూ, దేశ భద్రతను బలోపేతం చేయగలరంటారామె.
అయితే ఆ మాటలను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఒత్తిడి వచ్చినప్పటికీ, అవి యాదృచ్ఛికంగా మాట్లాడినవి కావు. ఆ మాటలు లోతైన అవగాహనతో, వివక్షతతో మాట్లాడిన మాటలే. కర్కరే క్షుణ్ణమైన దర్యాప్తు నిర్వహించినప్పటికీ, యూపిఎ-2 ప్రభుత్వం హిందూ మితవాద గ్రూపులపై నేరాన్ని ఆరోపించే ప్రయత్నం చేస్తుందని ప్రచారంలో పెట్టారు. పేలుళ్ళు జరిగిన సమయంలో ఇద్దరు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు జైళ్లలో వున్నారు. కేసులలో చిక్కుకున్న అనేక మంది విడుదల చేయబడ్డారు. దీనికి కారణం ఏమంటే దర్యాప్తు చేసే అధికారులకు ఈ కేసుల విషయంలో సున్నితంగా వ్యవహరించాల్సిందిగా ఆదేశాలు అందాయి. ముంబాయి కోర్టుకు చెందిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియన్ ఈ విషయాన్ని చెప్పారు. ఈ ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు తెలియజేశారు. ఈ కారణంగా ఆమెను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి నుండి తొలగించారు.
గాడ్సేకి సంబంధించి ఠాకూర్ చేసే ప్రకటనలు అన్నీ కూడా రహస్య కుట్రలో భాగమే. బహిరంగంగా గాడ్సేను స్తుతించటం, ఆయన పేరు మీద గుడులు నిర్మించడం వారి దురాలోచనలో భాగమే. హిందూ మహాసభకు చెందిన పూనం పాండే 30 జనవరి, 2019న (గాంధీజీ హత్య జరిగిన రోజున) సంబరాలు చేయడం ఇందులో భాగమే.
కుల, వర్ణ దురహంకారం అనేవి ఆధిపత్య జాతీయవాదంలో భాగమే. వర్ణ, పురుషాధిక్య భావజాలం కలిగి వున్నందువల్లే అంబేద్కర్ మనుస్మృతి రాతప్రతులను దహనం చేశారు. కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన సర్ సంఫ్‌ు చాలక్, గోల్వాల్కర్ మాత్రం మనువును ప్రశంసిస్తూ, ఈ సనాతన శాసనాలు ఈనాటికీ అనుసరించదగినవే అని చెప్పాడు. ఆర్‌ఎస్‌ఎస్ పత్రిక 'ఆర్గనైజర్' రాజ్యాంగాన్ని విమర్శిస్తూ...ఈ రాజ్యాంగం మనుస్మృతిలో వున్న ఘనమైన సూత్రాలకు అనుగుణంగా లేదనే కారణంతో రాజ్యాంగాన్ని తిరస్కరించింది. అదేవిధంగా అనేకమంది హిందూ జాతీయవాదులు, భారతదేశానికి మనుస్మృతి వుండగా మరొక కొత్త రాజ్యాంగం అవసరం లేదని వాదిస్తున్నారు.
ఈ ఆధిపత్య భావజాల గందరగోళమేమంటే, భారత రాజ్యాంగం పట్ల సానుభూతితో మాట్లాడుతూ...ఆచరణలో రాజ్యాంగాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేయడం. హిందువులను సంఘటిత పరచడానికి ముస్లిములను దోషులుగా చూపి...హిందువులను సమీకరించడం. అయితే తమ వ్యూహంలో భాగంగా దళితులను లోబర్చుకోవడమే వారికి క్లిష్టమైన సమస్యగా మారింది.
డాక్టర్ అంబేద్కర్ కుల నిర్మూలననే లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ హిందూ జాతీయవాద భావజాలం సామాజిక సామరస్య ఫోరమ్‌ను (సామాజిక్ సమ్రస్తా మార్చ్)ను ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. వీరు ముందుకు తీసుకు వచ్చిన అంశం ఏమంటే, ప్రాచీన కాలంలో అన్ని కులాలు సమానత్వంతో వుంటూ సామరస్యంగా జీవించేవని, ముస్లింలు భారతదేశానికి వచ్చిన తరువాత వీరిని మత మార్పిడి గావించే ప్రయత్నం చేశారని, కానీ స్థానికులు ఆ ప్రతిపాదనను ప్రతిఘటించారని, అందువల్ల వారిని వేరు చేసి అసమానత్వ కులాలుగా మార్చారని ప్రచారం చేస్తున్నారు. మోడీ తన ''కర్మయోగ్'' పుస్తకం (తరువాత ఉపసంహరించబడింది)లో, మరుగుదొడ్లను శుభ్రం చేసేవారు తమ జీవనాధారం కోసమే ఆ పని చేయడం లేదని, ఆ పని చేయడంలో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతున్నారని తెలిపారు. ఈ విధంగా సామాజికంగా మార్పు చేసే నైపుణ్యంతో దళితులను హిందూత్వ రాజకీయ పరిధి లోకి ఇముడ్చుకోవడంలో చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే విధంగా దళిత ఆదివాసీలను కూడా హిందూ జాతీయ రాజకీయాల్లో సైనికులుగా ఉపయోగించుకుంటున్నారు.
పదవులను ఎర చూపి అనేక మంది దళిత నాయకులను కూడా తమలో కలుపుకోవడంలో బిజెపి విజయవంతమైంది. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మాట్లాడేది ఏదైనా, అధికార పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలకు భిన్నంగా వుండదు. అయితే ఏం చెప్పాలి, ఎలాంటి అర్ధాన్ని ఇవ్వాలనేదే ప్రశ్న. దీనికి అత్యంత సారూప్యత కలిగిన అంశం ఏనుగు దంతాలు. మనం చూసేది, మనకు చూపించేది, మనకు కనిపించేది వాస్తవానికి భిన్నంగా వుంటాయి. ఈ భావజాలం వున్న సంస్థకు సవాల్ ఏమంటే, గాంధీ పేరును ఉపయోగించుకుంటూనే గాడ్సేని తమ భావజాలంలో సజీవంగా ఉంచగల్గడం. కుల, వర్ణ వ్యవస్థలను సజీవంగా వుంచుతూనే, సమానత్వాన్ని గూర్చి మాట్లాడడం వారి లక్ష్యంగా ఉంది.
క్షత్రియులు అధిక సంతానాన్ని కలిగి ఉండాలనే వాదన మొట్ట మొదటిసారి చాలా బలంగా, స్పష్టంగా వింటున్నాం. ఇప్పటి వరకు అనేక మంది ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యులు కుటుంబ నియంత్రణ పథకాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీనికి కారణం ముస్లింలు కుటుంబ నియంత్రణను పాటించడం లేదని, హిందువులు కుటుంబ నియంత్రణను పాటిస్తే, ముస్లింల జనాభా పెరిగిపోతుందనేది వారి వాదన. అనేకమంది బ్రహ్మచార ప్రచారకులు హిందూ స్త్రీలు అధిక సంతానాన్ని కనాలని ప్రచారం చేస్తున్నారు. హిందువుల్లో వర్ణ వ్యవస్థను ముందుకు తెస్తూ, క్షత్రియులు యుద్ధ భూమిలో పని చేయడం కోసం, ఎక్కువ మంది పిల్లలను కనాలని ఠాకూర్ చెప్తుంటారు. ఇది అసహజమైనది. ఈ పద్ధతిని సాయుధ దళాలలో, నియామక విధానాల్లో కూడా అనుసరిస్తారా అనేది కొంతకాలం తర్వాతయినా స్పష్టమవుతుంది.
లోతైన మతపరమైన సాంప్రదాయాలు కలిగిన ఠాకూర్ మైనార్టీలను అట్టడుగుకు నెట్టివేయడమే కాక, హిందూ ఐక్యతను ప్రదర్శించే లక్ష్యంతో పని చేస్తారు. అయితే ఈ పద్ధతిలో కుల, వర్ణ ఆధిపత్యాన్ని నిలబెట్టడమే తన లక్ష్యంగా ఉంది. ఆ విధంగా ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ బిజెపి భావజాలానికి ప్రతినిధిగా నిలుస్తున్నారు.
-రామ్ పునియానీ ( సామాజిక కార్యకర్త)










