ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం నిర్వహిస్తున్న ఆందోళన కొత్త చరిత్రను సృష్టిస్తోంది. 30 రోజులు గడిచినా రైతుల పట్టుదల ఏమాత్రం సడలకపోగా రోజురోజుకీ ద్విగుణీకృతమౌతోందంటే వారు లేవనెత్తిన డిమాండ్లలోని హేతుబద్ధతే అందుకు కారణం. పోరాట కేంద్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న రైతుల సంఖ్యే దీనికి నిదర్శనం. కేంద్రం ఏకపక్షంగా రూపొందించిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని రైతాంగం అడుగుతుంటే ససేమిరా అనడమే కాకుండా పోటీ సభ పెట్టడం దారుణం. వర్చువల్‌గా జరిగిన ఈ సభలో ప్రధాని నరేంద్రమోడీ పొంతనలేని మాటలు చెప్పడం, రైతు ఉద్యమాన్ని చులకన చేయడం, నేతలకు దురుద్దేశాలు అంటకట్టడం తగదు.
కేరళ ప్రభుత్వంపై దుమ్మెతి పోయడం, మండీలు (మార్కెట్ యార్డులు) ఎందుకు లేవంటూ ప్రశ్నించడం మోసపూరిత వ్యూహమే! నిజానికి కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తే సరళీకరణ ఆర్థిక విధానాలను సవాల్ చేసే ప్రత్యామ్నాయ విధానాలను సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటిస్తోంది. ధాన్యాన్ని రైతుల నుండి నేరుగా సేకరించడంతో పాటు, క్వింటాల్‌కు 2,870 రూపాయలు మద్దతు ధర ఇస్తోంది. అదే సమయంలో మోడీ ప్రభుత్వం 1,870 రూపాయలు మాత్రమే ఇస్తుండటం గమనార్హం. ఆ ధరకు కూడా ప్రభుత్వం సేకరించకపోవడంతో అనేక రాష్ట్రాల్లో రైతులకు 900 నుండి 1100 రూపాయలు దొరకడమే కష్టంగా మారుతోంది. అందుకే, రైతులు కనీస మద్దతు ధర కోసం పట్టుబడుతున్నారు. పైగా కేరళలో 82 శాతం వాణిజ్య పంటలనే సాగుచేస్తున్నారు. అయినా, దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా 16 రకాల కూరగాయలకూ కనీస మద్దతు ధర ప్రకటించి, అమలు చేస్తున్న ఘనత కేరళ వామపక్ష ప్రభుత్వానిది! ఇక అత్యధికంగా పండే కొబ్బరి, జీడిమామిడి తో పాటు ఇతర పంటలకు సహకార విధానంలో కనీస మద్దతు ధరతో పాటు మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఈ కృషిలో ఎక్కడికక్కడ స్థానిక ప్రభుత్వాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సుల స్ఫూర్తి కూడా ఇదే! ఈ వాస్తవాలకు భిన్నంగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడం ఎవరి కొమ్ము కాయడానికో?
కార్పొరేట్ల దయా దాక్షిణ్యాలకు వదిలేసేలా ఒకవైపు చట్టాలు రూపొందిస్తూ మరో వైపు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారంటూ వేరెవ్వరివైపో వేలెత్తిచూపడం మోసకారితనమే! నిజంగా అంత ప్రేమే ఉంటే ఎముకలు కొరికేసే చలికి గడ్డకొట్టుకుపోతూ ప్రాణాలొదిలేస్తున్న సహచరులకు నివాళులర్పిస్తూ రైతాంగం కొనసాగిస్తున్న పోరాటానికి ప్రధాని ఎందుకు స్పందించరు? నల్లచట్టాలను ఎందుకు రద్దు చేయరు? ఎవరు ఎవరి పక్షాన ఉన్నారో అర్ధం కావడం లేదూ! రైతాంగ ఉద్యమంలో రాజకీయ పార్టీలు చొరబడి సంబంధం లేని డిమాండ్లను చేర్చారని ప్రధాని అనడం సబబేనా? ఆందోళన ప్రారంభం నుండి ఇప్పటి వరకు రైతులు అడుగుతున్నదేమిటో, కేంద్రం తిరస్కరిస్తున్న దేమిటో స్పష్టంగా కళ్ల ముందే ఉంది కదా! ఇంత వక్రీకరణా? ఏ డిమాండ్ కొత్తగా వచ్చి చేరిందో మోడీ అండ్‌కో చెప్పగలదా? ఆందోళన ప్రారంభమైన మొదటిరోజు నుండి ఒకే మాట మీద ఉన్న సంఘాలను చీల్చి పబ్బం గడుపుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఏం చేయాలో తోచక ఉక్రోషంతో అంటున్న మాటలా ఇవి? నిజానికి బిఎస్‌ఎన్‌ఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలని, ప్రజల రక్తమాంసాలు పీల్చి తెగబలుస్తున్న కార్పొరేట్ సంస్థలను బహిష్కరించాలని పిలుపునిస్తూ సాగుతున్న అత్యంత దేశభక్తియుతమైన ఉద్యమమిది! స్వతంత్ర భారత చరిత్రలో ఇటువంటి పోరాటం నభూతో! మోడీ సర్కారు ఇప్పటికైనా రైతులపై వారు సాగిస్తున్న ఉద్యమంపై దుమ్మెత్తిపోయడం మాని వారి డిమాండ్లను బేషరతుగా ఆమోదించాలి.










