న్యూఢిల్లీ : దళితుల ఓట్లపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకోగా, భగవంత్ మాన్‌కు వున్న ప్రజాదరణపై ఆప్ ఆధారపడింది. అమరీందర్ సింగ్‌తో పొత్తు పెట్టుకుని అధికారాన్ని చేజిక్కించుకోవాలని బిజెపి చూస్తోంది. ఒకప్పటి బిజెపి మిత్రపక్షం అకాలీదళ్ ప్రజల విశ్వాసాన్ని కూడగట్టుకునేందుకు తంటాలు పడుతోంది. ఇదీ స్థూలంగా పంజాబ్ ఎన్నికల ముఖచిత్రం.
గతేడాది చివరిలో అమరీందర్ సింగ్‌ను గద్దె దించి దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నిని ముఖ్యమంత్రిగా నియమించడమే ఆశ్చర్యకరమైన పరిణామం. అలాగే, జనవరి 13 లోహ్రి పండుగకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భగవంత్ మాన్‌ను తెరపైకి తీసుకురావడం కూడా ముందుగా ఊహించిందే. పైగా అనివార్యం కూడా. ఎందుకంటే ఆప్‌కు మరో ప్రత్యామ్నాయం లేదు. మాన్ కూడా ఈ పదవిని 2017 ఎన్నికల్లోనే కోరుకున్నారు. ఐదేళ్ళు వేచి వున్న తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చింది. కాంగ్రెస్‌కు సిఎం పదవిని ఆశించే అభ్యర్థులు చాలా మందే వున్నారు, కానీ కింది స్థాయి నాయకత్వం లేనందున ఆప్‌కు వున్న చాయిస్ తక్కువే. దాంతో మాన్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న వేళ దళిత నేత చన్నిని ముఖ్యమంత్రి గద్దెపై కూర్చోబెడుతూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా తెలివైనదే కాదు, ఎత్తుగడల దృష్ట్యా కూడా సరైనదే. పార్టీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూతో కలిసి చన్ని పనిచేయగలరని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక ఓటు బ్యాంక్ రాజకీయాల కోణంలో చూసినట్లైతే, చన్ని, ముఖ్యమంత్రి పదవికి ఎంపికైన మొదటి దళిత వ్యక్తి. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి), బహుజన సమాజ్ పార్టీ (బిఎస్‌పి)తో పొత్తు పెట్టుకుని, అధికారంలోకి వస్తే దళితుడికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని ఆఫర్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ తెలివిగా ఏకంగా దళితుడినే ముఖ్యమంత్రిని చేసేసింది. ఎస్‌సిల ఓట్ల విలువను గుర్తించిన నేతలు పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ ఫిబ్రవరి 14 నుండి 20కి ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఎందుకంటే ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతిని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో ఎస్‌సి లు వారణాసి వెళ్లే అవకాశాలు వున్నాయి. రాష్ట్రంలో దాదాపు 50లక్షల మంది గురు రవిదాస్ ఫాలోవర్స్ వున్నారు. ఇది దృష్టిలో వుంచుకుని మెజారిటీ ఎస్‌సిలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అందుబాటులో వుండరనే కారణంతో ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలను వాయిదా వేసింది.
ఫిబ్రవరి 20న ఎన్నికలు జరుగుతాయని ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 117 నియోజకవర్గాలకు గానూ 23 స్థానాల్లో దళితుల ఓట్లే కీలకం. దళితులు ఎక్కువగా వుండే దోబా ప్రాంతంలో ఎక్కువగా ప్రయోజనాలు పొందగలమని పాలక కాంగ్రెస్ ఆశిస్తోంది.
గత కొద్ది కాలంలో రాష్ట్రంలో తడబడుతున్న పరిస్థితుల్లో వున్న కాంగ్రెస్‌కు చన్ని నియమాకం కొత్త ఉత్సాహాన్ని, ఊపును ఇస్తోంది. నవజోత్ సిద్దుాఅమరీందర్ సింగ్ హయాం చాలా కాలమే కొనసాగింది. అయితే, అమరీందర్ సింగ్‌పై చాలా ఆరోపణలు వచ్చాయి. కానీ సోనియా గాంధీ కూడా, కెప్టెన్ పట్ల మెతక ధోరణే అనుసరించారు. ఆ ఆరోపణలు వేటినీ పట్టంచుకోలేదు. ఎట్టకేలకు బయటకు పంపించడంతో అమరీందర్ సింగ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేరు కుంపటి పెట్టారు. పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేశారు. పైగా బిజెపితో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయనకు విశ్వాసపాత్రులైన ముగ్గురు ఎంఎల్‌ఎలు కూడా బిజెపిలో చేరారు. అమరీందర్, బిజెపితో కుమ్మక్కయ్యారని సిద్దు చేస్తున్న ఆరోపణలు నిజమేనని దీంతో స్పష్టమైంది.
ఇక, ఫిరోజ్‌పూర్‌లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీతో కలిసి అమరీందర్ వేదికను పంచుకోవాల్సి వుంది. కానీ ఈ సభకు పెద్దగా జనాలు హాజరు కాకపోవడం, ఇది చూసి ప్రధాని నరేంద్ర మోడీ అక్కడకు రాకుండానే భద్రతా కారణాలను సాకుగా పెట్టి వెళ్ళిపోవడంతో అమరీందర్ సింగ్ తన రాజకీయ కెరీర్‌కు తానే శుభం కార్డు రాసుకున్నట్లు కనిపిస్తోంది. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా, పంజాబ్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎలతో సుదీర్ఘకాలం ఆయనకు అనుబంధం కూడా వుంది. అలాంటిది పదవి నుండి దింపగానే ఒక్కసారిగా అవన్నీ పక్కకు పెట్టి బిజెపితో చేతులు కలపాలని ఆయన తీసుకున్న నిర్ణయం బెడిసి కొట్టింది. రెండు పార్టీల నుండి ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో అమరీందర్ సింగ్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనవారనే వారే లేకుండా పోయారు. ఇటు బిజెపి దశాబ్దాల నాటి మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి)ను పోగొట్టుకుంది. ఇటీవల సుదీర్ఘకాలంగా సాగిన రైతాంగ పోరాటం, తలెత్తిన పరిస్థితుల నేపథ్యంలో బిజెపి ఎంఎల్‌ఎలు కానీ ఎంపీలు కానీ కొంత కాలంగా తమ నియోజకవర్గాల్లో కాలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అమరీందర్ సింగ్‌తో పొత్తు పెట్టుకుని ఎలాగైనా రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తోంది. మోడీకి, బిజెపికి పంజాబ్‌లో పెద్దగా స్పందన లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపడంలో కూడా పార్టీ విఫలమైంది. ఈసారి ఎన్నికల్లో కూడా తన పరిస్థితిని మెరుగుపరుచుకునే అవకాశాలు లేవనే చెప్పాలి.
లక్ష్యమంటూ లేని శిరోమణి అకాలీదళ్
శిరోమణి అకాలీ దళ్ (ఎస్‌ఎడి) బలమైన శక్తే అయినా, భిన్నాభిప్రాయాలు, అసమ్మతులతో కునారిల్లుతూ, తన ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా ఎలాంటి అంశాలను పేర్కొనకపోవడంతో బాదల్ పార్టీకి ఒక దిశా నిర్దేశం అంటూ లేకుండా పోయింది. వ్యవసాయ చట్టాలపై రేగిన ఆగ్రహంతో బిజెపితో తెగతెంపులు చేసుకుంది. అయితే, వివేచన గలిగిన ఓటర్ల దృష్టిలో వ్యవసాయ చట్టాల రూపకల్పనలో ఎస్‌ఎడి ఒక భాగస్వామిగా వుంది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) నుండి శిరోమణి అకాలీ దళ్(ఎస్‌ఎడి) బయటకు రావడానికి ముందు హర్‌సిమ్రత్ కౌర ఫుడ్ ప్రాసెసింగ్ ఇండిస్టీస్ మంత్రిగా వున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బిఎస్‌పి మాదిరిగా ఇక్కడ అకాలీదళ్ కూడా ఆప్, కాంగ్రెస్ మాదిరిగా కాకుండా చాలా నెమ్మదిగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఎన్నికల సందడి మొదలవడానికి చాలా ముందుగానే ఆప్, కాంగ్రెస్ నేతలు పరస్పరం పంచ్‌లు విసురుకుంటూ ప్రచారాస్త్రాలు సంధిస్తూ వచ్చారు. ఎస్‌ఎడి నేత, పాటియాలా మాజీ మేయర్ అజిత్‌పాల్ సింగ్ కోహ్లి ఆప్‌లోకి వచ్చేశారు. ఆయన్ని అమృత్‌సర్ అర్బన్ సీటు నుండి నిలబెట్టారు. ప్రస్తుతం అమరీందర్ సింగ్ ఆ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వ్యవసాయ చట్టాలపై ఉధృతంగా సాగిన పోరాటం ద్వారా లభించిన మద్దతును ఉపయోగించుకుని ఎన్నికల్లో నిలబడి ఫలితం పొందాలని కొన్ని రైతు సంఘాలతో ఏర్పాటు చేసిన సంయుక్త సమాజ్ మోర్చా భావిస్తోంది. అయితే ఉద్యమ ప్రముఖులు, మంచి కార్యకర్తలు వున్నందున మోర్చాకు అసెంబ్లీలో సీట్లు రావడం కన్నా ప్రచారానికి ఎక్కువ అవకాశాలు వున్నాయి.










