ఆందోళనలు కొనసాగిస్తే చంపేస్తాం - ఎఐకెఎస్ మహరాష్ట్ర కార్యదర్శి నవాలేకు సంపరివార్ మూకల బెదిరింపు
ఇండియా న్యూస్ నెట్‌వర్క్- న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న మహా ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్రలు పన్నుతున్న బిజెపి, సంఘ్పరివార్ మూకలు మరింత తెగించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తే చంపేస్తామని కూడా అత్యంత దారుణ రీతిలో రైతు నేతలను బెదిరిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర ఎఐకెఎస్ కార్యదర్శి డాక్టర్ అజిత్ నవాలేకు ఇవే బెదిరింపులు ఎదురయ్యాయి. మీరు చేస్తున్న ఆందోళనలు కొనసాగిస్తే తుపాకీతో కాల్చిచంపేస్తామని సంఫ్‌ు పరివార్‌కు చెందిన సైబర్ గూండాలు సోషల్ మీడియా ద్వారా అజిత్‌నవాలేను బెదిరించాయి. ఈ చర్యను ఎఐకెఎస్ శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. ఇటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అదేవిధంగా ఇలాంటి పిరికి బెదిరింపులకు లేదా పోలీసుల చర్యలకు ఏ రైతు నేతా వెనక్కు తగ్గడని స్పష్టం చేసింది.
అధికార పార్టీకి మద్దతుగా కొందరు వ్యవస్థీకృత గూండాలు సింఘూ సరిహద్దు వద్ద రేకెత్తించిన ప్రణాళికాబద్ధమైన హింసను ఎఐకెఎస్ ఖండించింది. ఘాజీపూర్, పల్వాల్, షాజహాన్‌పూర్ సరిహద్దుల వద్ద ఉత్తరపద్రేశ్, హర్యానా పోలీసుల సాయంతో హింసాత్మక గ్రూపులను ఏర్పాటు చేసిందని, ఆయా ప్రాంతాల్లో పౌర కలహాలను సృష్టించే కుట్రలు పన్నిందని తెలిపింది. ఇటువంటి సంఘ విద్రోహ శక్తులకు సహకారం అందిస్తున్న బిజెపి ప్రభుత్వం, పోలీసులలే గణంతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యత అని ఎఐకెఎస్ పేర్కొంది. రైతుల ఉద్యమాన్ని కించపరిచేందుకు వారు వేస్తున్న గేమ్‌ప్లాన్‌ను ప్రజలందరూ చూస్తున్నారని స్పష్టం చేసింది.
బిజెపి ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ మీడియా విషప్రచారం చేస్తున్నప్పటికీ, బెదిరింపులకు పాల్పడడం వంటి పిరికి చర్యలకు పాల్పడుతున్నప్పటికీ రైతు ఉద్యమం రోజురోజుకు బలోపేతం అవడం చూసి పాలకులకు వెన్నులో వణుకు పుడుతోందని తెలిపింది. రైతులకు మద్దతుగా నిలవడంతో పాటు బిజెపి, సంఫ్‌ుపరివార్ మూకలు పాల్పడుతున్న ఈ వ్యవస్థీకృత హింసను ఎండగట్టేందుకు ప్రజాస్వామ్యవాదులందరూ ముందుకు రావాలని ఎఐకెఎస్ పిలుపునిచ్చింది.










