Jan 04,2023 12:58

ప్రజాశక్తి-బి.కొత్తకోట :  ప్రజా సమస్యలపై మాట్లాడే గొంతులను అణగదొక్కేందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1 ని జారీ చేసిందని, నిరంకుశ నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్న జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, జీవో నెం.1 చీకటి జీవోగా చరిత్రలో నిలిచిపోతుందని ఏఐటీయూసీ తంబళ్లపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు సలీం భాషా ఆరోపించారు. బుధవారంబి.కొత్తకోట  ఏఐటీయూసీ ఆధ్వర్యంలో  స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద జోఓ కాపీలను దగ్దం చేశారు. ఈ సందర్భంగా  సలీం భాషా మాట్లాడుతూ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ వైఫల్యాలను పత్రికలు, మీడియా బయటపెడుతున్నాయనే కక్షతో జీవో నెం.2430 తెచ్చిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు నోరెత్తకుండా చేయాలనే ఉద్దేశ్యంతో జీవో నెం.1 తెచ్చారని మండిపడ్డారు. ప్రజలు, పత్రికలు, ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయకూడదు, తప్పుల్ని ఎత్తి చూపకూడదు అనడం ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డి  తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడం దుర్మార్గమన్నారు. ఉద్యమం అనే మాట ఎంతో పవిత్రమైనది. ప్రభుత్వ అన్యాయాలను, అవినీతిని, ప్రజా సమస్యలను ఎండగడుతూ ప్రజాస్వామ్యం ప్రజలకు కల్పించే హక్కుల సాధనకు ఆయుధంగా ఉన్న ఉద్యమాలను అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు అని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌మోహన్ రెడ్డి నిర్వహించిన సభలు, సమావేశాలకు, పాదయాత్రకు అనుమతి ఇవ్వకుంటే జగన్‌రెడ్డి ఇంట్లో నుంచి కాలు బయటపెట్టేవాడా? అని నిలదీశారు. ప్రభుత్వ వేధింపులకు, ఆంక్షలకు భయపడేది లేదు. ప్రజా సమస్యలపై , కార్మిక వర్గ సమస్యలపై పోరాటం కొనసాగుతుంది.  కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా , కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడానికి ప్రజా సమస్యలు కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం కానప్పుడు ప్రజలు కార్మికులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలియజేసే హక్కులను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హరిస్తున్నాయన్నారు. అందులో భాగంగానే ఫిబ్రవరి 2వ తేదీన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటిని తీసుకొచ్చిందని ఈ జీవో రద్దు చేసేంతవరకు ఏఐటీయూసీ, ఇతర కార్మిక సంఘాలను రాజకీయ పార్టీలను కలుపుకుని ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బి.కొత్తకోట మండల అధ్యక్షుడు అష్రప్ ఆలీ, గంగులప్ప, బాలకృష్ణ, రామచంద్ర, మనోహర్, కృష్ణప్ప,హబీబ్ మోదీన్ తదితరులు పాల్గొన్నారు