న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న తరుణంలో అన్ని ర్యాలీలపై నిషేధాన్ని కేంద్రం ఎన్నికల కమిషన్ పొడిగించింది. ఫిబ్రవరి 11 వరకు ఉత్తరాఖండ్, గోవా, ఉత్తరప్రదేశ్, మణిపూర్, పంజాబ్‌ల్లో ర్యాలీలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. రోడ్‌షోలు, సైకిల్, బైక్, ఇతర వాహన ర్యాలీలు, ఊరేగింపులపై నిషేధాన్ని విధించింది. కరోనా ఉధృతి నేపథ్యంలో గతంలో ఆంక్షలు విధించగా.. ఇప్పుడు కొన్ని సడలింపులను ఇచ్చింది. అయితే సమావేశాలు, ఎన్నికల ప్రచారానికి ప్రజలు పాల్గనేందుకు అనుమతినిచ్చింది. బహిరంగ సమావేశంలో గరిష్టంగా వెయ్యి మంది పాల్గనేందుకు అనుమతించింది. కాగా, డోర్ టు డోర్ క్యాంపెయిన్‌కు గతంలో 10 మందికి మాత్రమే అనుమతి ఉండగా... ఇప్పుడు 20 మందికి పెంచింది. ఇండోర్‌లో జరిగే సమావేశాలకు గతంలో 300 మందికి అనుమతి ఉండగా.. ఇప్పుడు 500 మందికి అనుమతినిచ్చింది. కోవిడ్ వ్యాప్తి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ఆరోగ్య, ఎన్నికల అధికారులతో ఎన్నికల కమిషన్ సమావేశమైంది.










