Jan 29,2022 18:53

పనాజీ : గోవాలో పాగా పాతేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో టిఎంసి-మహారాష్ట్రవాదీ గోమాంతక్‌ పార్టీ (ఎంజిపి) నేతృత్వంలోని కూటమి మ్యానిఫెస్టోను విడుదల చేసింది.  తాము అధికారంలోకి వస్తే.. గృహ లక్ష్మి పథకం కింద ప్రతి మహిళ బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రూ. 5 వేలు జమ చేస్తామని పేర్కొంది. యువ శక్తి ఫర్‌ ద యూత్‌ ఆఫ్‌ గోవా కింద 4 రూపాయల వడ్డీకి రూ. 20 లక్షల లోన్‌ ఇస్తామని హామీలనిచ్చింది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని టిఎంసి నేత లుయిజిన్హో ఫలీరో తెలిపారు. గోవాలో 2 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని.. 80 శాతం ఉద్యోగులకు స్థానికులకే అని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న రెండు కొత్త మెడికల్‌ కాలేజీల్లో ఆరోగ్యం, మెడికల్‌ సదుపాయాల నిమిత్తం బడ్జెట్‌ను రెండింతలు చేస్తామని హామీనిచ్చారు. ఈ కూటమి అధికారంలోకి వస్తే.. మెరుగైన రహదారులు, సమృద్ధిగా నీటిని అందజేస్తామని అన్నారు. గోవాలోని మోలెమ్‌లో రానున్న మూడు లీనియర్‌ ప్రాజెక్టులను రద్దు చేస్తామని చెప్పారు.  సుమారు 25 పథకాలతో కూడిన హామీలను గుప్పించింది.