Nov 10,2023 20:37

సామాజిక సాధికార యాత్ర సభలో రెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ :  రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందని రాష్ట్ర రెవెన్యూశాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్‌శాఖామంత్రి బూడి ముత్యాలునాయుడు, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. వైసిపి చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర శుక్రవారం పార్వతీపురంలో జరిగింది. తొలుత సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట నుంచి ప్రారంభమైన బస్సుయాత్రకు వైసిపి కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహనాల ర్యాలీతో పార్వతీపురం చేరుకున్నారు. అనంతరం పాతబస్టాండ్‌లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఎవరి ప్రమేయం, ఎవరి ప్రోద్బలం లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకూ, మెరుగుదలకూ ఉద్దేశించి చేస్తున్న పథకాల నిర్వహణను అర్థం చేసుకుని, వాటితో ముడిపడి ఉన్న ఆర్థిక ప్రయోజనాలు కన్నా సామాజిక ప్రయోజనాలను గుర్తించాలన్నారు. ఇదీ టిడిపికి, వైసిపి ప్రభుత్వానికీ ఉన్న తేడా అని అన్నారు. ఊరూరా తిరిగి ప్రజల కష్ట నష్టాలు గుర్తించి పాదయాత్రలో చెప్పినవన్నీ చేసిన ఏకైక నాయకులు వైయస్‌ జగన్‌ అని చెప్పారు. 2014 ఎన్నికల వేళ తమకు ఓటు వేస్తే ఇవి చేస్తాం అవి చేస్తే అని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. రైతులను, మహిళా సంఘాలను, అన్ని వర్గాలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. విద్యాభివృద్ధి కోసమే నాడు-నేడు పథకాన్ని జగన్‌ తీసుకొచ్చారని తెలిపారు. ఏ కారణంతోనూ పేదల చదువు అర్థాంతరంగా ఆగిపోకూడదని భావించి, రకరకాలుగా వారికి ప్రోత్సాహం అందిస్తున్నామని వివరించారు.

   సభకు హాజరైన జనం
 సభకు హాజరైన జనం

అట్టడుగువర్గాలకు అండగా : రాజన్న దొర
విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక చర్యలు చేపట్టిన ఘనత సిఎం జగన్‌దని ఉపముఖ్యమంత్రి రాజన్నదొర అన్నారు. గతంలో లంచం లేనిదే పని జరిగేది కాదని, కానీ నేడు ప్రతిదీ ఇంటికే వస్తుందని, కాబట్టి ప్రజలు ఈ రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న తేడాను గమనించాలని కోరారు. పేద వర్గాలంటే అట్టడుగునే ఉండాలనే స్థితిని మార్చారని తెలిపారు. అంబేద్కర్‌, పూలే, కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ, అభివృధ్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల కల అయిన పార్వతీపురం మన్యం జిల్లాను వైసిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.
మంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టిలకు, మైనార్టీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఘనత వైసిపికే దక్కుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కల్లబొల్లి కబుర్లు చెప్పి టిడిపి నాయకులు ఓట్లు అడిగేందుకు వస్తారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. కార్యక్రమంలో ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్‌, గొట్టేటి మాధవి, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడారు. వైసిపి జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్‌ రాజు, ఎమ్మెల్యేలు పుష్పాశ్రీవాణి, విశ్వసరాయి కళావతి, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, ఎస్‌సి కమిషన్‌ సభ్యురాలు సవరపు జయమణి, ఎమ్మెల్సీ పాలవలస శ్రీకాంత్‌, రాష్ట్ర కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్న కుమార్‌, గిరిజన కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి రాణీ, దాసరి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రమాదేవి, నియోజక వర్గం పరిశీలకులు శోభాహైమావతి, జెడ్‌పి మాజీ చైర్మన్‌ చైర్మన్‌ వాకాడ నాగేశ్వరరావు
పార్వతీపురం నియోజక వర్గ నాయకులు బోను గౌరీశ్వరి, ఇండుపూరు గున్నేష్‌, కొండపల్లి రుక్మిణీ, జెడ్‌పటిసిలు, ఎంపిపిలు, సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.