హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబుతో గన్నవరం నేత, కేడీసీసీ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు భేటీ అయ్యారు. వైసిపిను వీడి టిడిపిలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన యార్లగడ్డ.. నేడు హైదరాబాద్‌లో చంద్రబాబును కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 19 ఏళ్లు అమెరికాలో ఉన్నప్పటి సంగతులు.. ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో స్వదేశానికి రావడం తదితర విషయాలను చంద్రబాబుకు వివరించినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. టిడిపిలో చేరేందుకు తన సమ్మతిని తెలిపానని.. కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారన్నారు. త్వరలోనే టిడిపిలో చేరతానని తెలిపారు.ప్రజాప్రతినిధిగా ఉంటే తప్ప రాజకీయాల్లో మనుగడ సాధించలేమని భావించి వైసిపిలో చేరి గన్నవరంలో ఆ పార్టీ తరఫున పోటీ చేశానని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. గన్నవరంలో టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి వైసిపికు మద్దతు తెలపడంతో తనను పక్కన పెట్టారని.. దీంతో గత మూడున్నర సంవత్సరాలుగా తనతో పాటు తన వర్గం పడుతున్న ఇబ్బందులను చంద్రబాబుకు వివరించానని చెప్పారు. గన్నవరం టిడిపి టికెట్‌పై హామీ లభించిందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని యార్లగడ్డ సమాధానమిచ్చారు. పార్టీ ఆదేశిస్తే గన్నవరం, గుడివాడ, విజయవాడ.. ఇలా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు










