- జింబాబ్వే చేతిలో 35పరుగుల తేడాతో ఓటమి
హరారే: రెండుసార్లు వన్డే ప్రపంచకప్ ఛాంపియన్ వెస్టిండీస్ జట్టు ఈసారి ప్రధాన టోర్నీకి అర్హత సాధించడమే కష్టంగా మారింది. ప్రధాన టోర్నీకి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో జింబాబ్వే చేతిలో 35పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే జట్టు ఐసిసి వన్డే ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే పసికూన అమెరికాపై గెలిస్తే నేరుగా ప్రధాన టోర్నీకి అర్హత సాధించనుంది.

ఇక శనివారం జరిగిన గ్రూప్-ఏ లీగ్ మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 49.5ఓవర్లలో 268పరుగులకు కుప్పకూలింది. సికిందర్ రాజా(68), రియాన్ బర్ల్(50) అర్ధసెంచరీలకి తోడు కెప్టెన్ ఎర్విన్(47) బ్యాటింగ్‌లో రాణించారు. కీమో పాల్‌కు మూడు, హొసైన్, జోసెఫ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో విండీస్ జట్టు 44.4 ఓవర్లలో 233పరుగులకే కుప్పకూలింది. మయర్స్(56), ఛేస్(44), పూరన్(34) బ్యాటింగ్‌లో రాణించారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ ఘోరంగా నిరశపరిచారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సికిందర్ రాజాకు లభించింది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వేజట్టు అమెరికా చేతిలో ఓడి.. వెస్టిండీస్ జట్టు నెదర్లాండ్స్‌పై విజయం సాధిస్తే సమీకరణలు మారే అవకాశముంది.
- నెదర్లాండ్స్ ఘన విజయం
గ్రూప్-ఏలో నెదర్లాండ్స్ జట్టు 7వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ జట్టు 44.3ఓవర్లలో 167పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో నెదర్లాండ్స్ జట్టు 27.1 ఓవర్లలో 3వికెట్ల నష్టానికి 168పరుగులు చేసి ఘన విజయం సాధించింది.










