May 09,2023 20:32

తస్కెంట్‌(ఉజ్బెకిస్తాన్‌): ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో మరో ఇద్దరు బాక్సర్లు క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్‌ 51కిలోల విభాగంలో దీపక్‌ భోరియా, 71కిలోల విభాగంలో నిషాంత్‌ దేవ్‌ ప్రత్యర్థులను చిత్తుచేశారు. దీపక్‌ భోరియా 5-0పాయింట్ల తేడాతో చైనాకు చెందిన జీమో జంగ్‌పై విజయం సాధించాడు. దీపక్‌ తొలిరౌండ్‌నుంచే ప్రత్యర్ధిపై బలమైన పంచ్‌లతో ఎదురుదాడికి దిగాడు. ఇక రెండోరౌండ్‌ ప్రారంభంలో కొంత డిఫెన్స్‌ మోడ్‌లోకి వెళ్లినా.. చివర్లో ఎడమచేతి హుక్స్‌ను ఉపయోగించాడు. ఇక మూడోరౌండ్‌లో దీపక్‌.. జంగ్‌పై మరింత దూకుడు పెంచి పాయింట్లను రాబట్టాడు. ఇక నిషాంత్‌ దేవ్‌ ప్రి క్వార్టర్స్‌లో పాలస్తీనాకు చెందిన ఫొఖాV్‌ాపై సునాయాసంగా విజయం సాధించాడు. బుధవారం జరిగే క్వార్టర్‌ఫైనల్లో నిషాంత్‌ దేవ్‌.. క్యూబాకు చెందిన ఫోర్జే కూలర్‌తో తలపడనున్నాడు. ఇక 54కిలోల విభాగంలో సచిన్‌ సివాచ్‌ టాప్‌సీడ్‌, కజకిస్తాన్‌కు చెందిన ముఖమ్మద్‌ సబైర్ఖాన్‌ చేతిలో 0-5పాయింట్లతోతో ఓటమిపాలయ్యాడు.