జిసిసికి నిధులు నిలిపివేత : గతేడాది నుంచి ఎంఎస్‌పి రివాల్వింగ్ ఫండ్ ఇవ్వని కేంద్రం
ప్రజాశక్తి - విశాఖపట్నం ప్రతినిధి : గిరిజన సహకార సంస్థ(జిసిసి)కు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రివాల్వింగ్ ఫండ్ గతేడాది నుంచి నిలిపివేసింది. జిసిసి పరిధిలోని ఐదు ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం... వాటికి ఇవ్వాల్సిన నిధులు విడుదల చేయకుండా సాంకేతిక కారణాలను సాకుగా చూపుతోంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆస్తుల పంపిణీ పూర్తి చేసుకున్నప్పటికీ, అంతకుముందు జిసిసి చేసిన అప్పులు, ఇచ్చిన రుణాలను ఇప్పటికీ తేల్చుకోలేదు. ఏ రాష్ట్ర రుణాల వాటా ఎంతనేది 2014 నుంచి ఈనాటికీ విడగొట్టుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపడంలేదు. దీంతో ఆడిట్ నివేదికను అధికారికంగా జిసిసి తయారుచేయలేకపోతోంది. ఆదాయం, ఖర్చుల వరకు ఏటా ఇంటర్నల్ ఆడిట్ జరుగుతున్నా మొత్తం ఆస్తులు, ఆదాయం, వ్యయం వంటి వాటికి పూర్తి స్థాయిలో ఆడిట్ జరగడంలేదు. ఆడిట్ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అడిగిన సమాచారం జిసిసి ఇవ్వలేకపోతోంది. గతంలో విడుదల చేసిన నిధులకు యుసిలు సమర్పించకపోతే తదుపరి నిధులు విడుదలచేయబోమంటూ నిలిపివేసింది. రాష్ట్ర విభజన తరువాత ఆడిట్ జరగకపోవడానికి కారణాలను కేంద్రం దృష్టికి జిసిసి అధికారులు తీసుకెళ్లినప్పటికీ నిధులు ఇవ్వడంలేదు. ఎంఎస్‌పి కింద కేంద్రం విడుదల చేస్తున్న నిధుల వినియోగంపై పూర్తి సమాచారం ఇస్తున్నా కేంద్రం పట్టించుకోవడంలేదు. ఎంఎస్‌పి కింద ఏటా నిధులు విడుదల చేయడంలేదు. 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిధులు 2020లో ఇచ్చినట్లు జిసిసి అధికారులు చెబుతున్నారు. 2020-21 సంవత్సరానికి రూ.7.21 కోట్లకు జిసిసి నుంచి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లాయి. గతేడాదికి సంబంధించి పైసా కూడా అక్కడి నుంచి విడుదల కాలేదు. చింతపండు, పిక్కతీసిన చింతపండు, దమ్ముకరియా, పుంగంసీడ్, మొహ్వసీడ్‌ను కేంద్రం ఎంఎస్‌పి పరిధిలోకి తీసుకొచ్చింది. జిసిసి ఎంఎస్‌పి ప్రకారం ఈ ఐదు వస్తువులకు ధర చెల్లించి కొనుగోలు చేస్తోంది. ఎంఎస్‌పి పరిధి కిందకు వచ్చిన వస్తువులను కొనుగోలు చేసిన జిసిసికి కేంద్రం ఇవ్వాల్సిన నిధులు మాత్రం ఇవ్వడంలేదు. రివాల్వింగ్ ఫండ్ విడుదల చేయకపోవడంతో జిసిసి ఆర్థిక ఇబ్బందులు పడుతోంది.










