ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్యజిల్లా) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరికి నిరసనగా ఈనెల 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్రచారభేరిని జయప్రదం చేయాలని సిపిఐ, సిపిఎం నాయకులు కోరారు. గురువారం సిపిఐ కార్యాలయంలో ప్రచార బేరి పోస్టర్లను వామపక్ష నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్, సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి సీ.రవికుమార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందాయన్నారు. బిజెపి కార్పొరేట్ మతోన్మాదం విధానాలను ప్రజలలో ఎండగట్టాలని అన్నారు. దేశాన్ని ఆదాని వారికి అప్పజెప్పడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేయడం, ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అదానీ గ్రూపు వారికే దారాదత్తం చేశారని తెలిపారు. మరోవైపు అధిక ధరలు ప్రజలను వేధిస్తున్నాయని అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని, దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని అన్నారు. ప్రైవేటీకరణ, జీఎస్టీతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. ఢిల్లీలో దాడులు, మతమార్పిడులు, మైనార్టీలపై, దళితులపై దాడులు అధికమయ్యాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ప్రజలలో ఎండగట్టాలని తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హౌదా ఇస్తామని, విభజన హామీలను అమలు చేస్తామని చెప్పినా ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని, రాజధాని నిర్మాణం జరగాలని, వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టనష్టాలను పట్టించుకోకుండా ఇస్తానుసారంగా ధరలు పెంచుకుంటూ పోతూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, రాష్ట్రంలో భూమాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా కొనసాగుతున్నదన్నారు. ఉద్యమాలు నిర్వహించడానికి కూడా వీలు లేకుండా జీవో నెంబర్ ఒకటి తీసుకువచ్చి రాష్ట్రంలో ప్రశ్నించే వాడే ఉండకూడదనే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. వీటన్నిటి పైన ఏప్రిల్ 14 నుంచి 30వ తేదీ వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమాలకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం.శివరామకృష్ణదేవరా, ఏరియా సహాయ కార్యదర్శి ఎమ్మెస్ రాయుడు, పట్టణ కార్యదర్శి సికిందర్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.










