Feb 28,2023 09:50

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ టెస్టుల్లో ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండోటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో విలియమ్సన్‌(132)పరుగులు చేసి న్యూజిలాండ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 26వ శతకాన్ని పూర్తి చేసుకోవడంతోపాటు రాస్‌ టేలర్‌ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించి రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం విలియమ్సన్‌ 7787 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రాస్‌ టేలర్‌ (7683) రెండో స్థానంలో నిలిచాడు. ఇక స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌(7172), బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌(6453), మార్టిన్‌ క్రో(5444) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. రాస్‌ టేలర్‌ 196 ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్‌ని సాధించగా.. విలియమ్సన్‌ 161 ఇన్నింగ్స్‌ల్లోనే టేలర్‌ రికార్డుని బ్రేక్‌ చేయడం విశేషం. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ జట్టు 483పరుగుల భారీస్కోర్‌ చేసింది. దీంతో ఇంగ్లండ్‌కు 258 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఇంగ్లండ్‌ జట్టు నాల్గోరోజు ఆట నిలిచే సమయానికి వికెట్‌ నష్టానికి 48పరుగులు చేసింది.