అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసును నిరూపించని వైసిపి.. చివరకు తమ పార్టీ అధికారిక ఖాతాకు వచ్చిన ఎన్నికల విరాళాలకు ఈ కేసును ముడిపెడుతోందని తెలుగుదేశం పార్టీ దుయ్యబట్టింది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వ్యవహారంపై ఆ పార్టీ నేతలు పుస్తకం విడుదల చేశారు. వాస్తవాలన్నీ పుస్తకం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఫలానా ఖాతాలోకి ఒక్క రూపాయి అయినా మళ్లిందని రుజువులు చూపగలరా అని నిలదీశారు. వైసిపి దోపిడీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పోరాటం చేస్తున్నందుకే, ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రయోగిస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.స్కిల్ డెవలప్‌మెంట్‌పై జీవో జారీ చేసిన ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నిపై ఎందుకు కేసు పెట్టలేదని అచ్చెన్న ప్రశ్నించారు. ''నిధులు విడుదలలో సంతకాలు చేసిన ప్రేమ చంద్రారెడ్డి, అజరు కల్లంలు నిందితులు కారా? విధాన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు మాత్రమే తప్పు చేశారని జైల్లో పెడతారా? మొదట ?3వేల కోట్ల అవినీతి అన్నారు. ఆ తర్వాత ?300కోట్లకు మార్చారు. ఇప్పుడు ఆధారాలు దొరక్క ?27కోట్ల అవినీతి అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దేశంలోని ప్రతి రాజకీయ పార్టీ ఖాతాకూ విరాళాలు వస్తాయి. ఎన్నికల సంఘం వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన సమాచారంతో స్కిల్ డబ్బంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడటం చంద్రబాబు చేసిన తప్పా? యువతతో గంజాయి అమ్మించాలన్నది జగన్‌మోహన్ రెడ్డి దృక్పథం. జగన్‌ను ఆర్థిక ఉగ్రవాది, పదితలల జగనాసురుడు.. ఇలా ఏ పేరుతో పిలవాలో ఆయన విచక్షణకే వదిలేస్తున్నాం'' అని అచ్చెన్న వ్యాఖ్యానించారు.










